వరంగల్ రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించింది యునెస్కో. తాజాగా యునెస్కో ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు ప్రపంచ వారసత్వ జాబితాలో 167 దేశాల నుంచి 1121 కట్టడాలను యునెస్కో గుర్తించింది. ఈ సారి ప్రపంచం నలుమూలల నుంచి 255 ప్రతిపాదనలను పరిశీలించిన యునెస్కో.. ఎట్టకేలకు రామప్పకు అంతర్జాతీయ గుర్తింపును ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ హోదా దక్కించుకున్న ఏకైక కట్టడంగా రామప్ప ఆలయం అరుదైన ఘనతను దక్కించుకుంది. తెలంగాణ లోని ములుగు జిల్లా పాలంపేటలో 800 ఏళ్ల కిందటనే ఈ రామప్ప ఆలయాన్ని కట్టారు. ఈ ఆలయానికి.. పునాది వేసింది కాకతీయులే కావడం విశేషం. కన్నార్పకుండా చేసే శిల్పాలు, అరుదైన ఎరుపు రాతి నిర్మాణాలు, నీటిలో తేలియాడే రాళ్లతో పై కప్పు నిర్మాణం లాంటివి రామప్ప ఆలయం యొక్క ప్రత్యేకతలు. ఇక యునెస్కో గుర్తింపు పట్ల తెలంగాణ సర్కార్ హర్షం వ్యక్తం చేసింది.