సమ్మక్క- సారక్క దేవతలు మహత్యం తెలియని వారంటూ ఉండరూ..కోరికలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న సమ్మక్క, సారక్కలు కోట్లాది మందికి ఇలావేల్పయ్యారు..కానీ ఆ దేవతలకు నీడలేకుండా పోయిందనేది జగమెరిగిన సత్యం..రెండేళ్లకోసారి..ఈ జాతరకు ప్రభుత్వం కోట్లల్లో ఖర్చుపెడుతుంది. అయితే ఆ దేవత జన్మస్థలాన్ని మాత్రం అధికారులు వదిలేశారా..ఇంతకీ ఆ వనదేవత జన్మస్థలం ఎక్కడ? ఎక్కడ కోయదొరలకు బంగారు వర్ణఛాయతో లభ్యమైంది? సమ్మక్క పసి తనంలో నడయాడిన నేల ఏది? సమ్మక్క జన్మస్థలంగా చరిత్రలో ఉన్న ఆ గ్రామం ఎక్కడుంది? సమ్మక్క మా ఇంటి ఆడబిడ్డే అంటున్న ఆ వంశీయులు ఎవరు? ఇలాంటి విషయాలు అన్ని మీకోసం..
సమ్మక్క జీవిత చరిత్రలో బయ్యక్కపేట గ్రామానికి ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ గ్రామానికి చెందిన కోయదొరలు సమ్మక్క దేవతను పెంచి పెద్ద చేసినట్లు చరిత్ర అంటుంది.. బయ్యక్కపేట పక్కనే ఉన్న అడవుల్లో వెదురుచెట్టు కింద పెట్టెలో బంగారు వర్ణ ఛాయతో వెలిగిపోతున్న పసికందును చేరదీసి ఆలించి లాలించి వీళ్లు పెంచారు. చందా వంశానికి చెందినవారు ఈ వనదేవతను చేరదీసినట్లు చరిత్ర చెబుతుంది..
రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర వస్తుందంటేచాలు ఈ మేడారం కుగ్రామానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు.. దేశవిదేశాల్లో ఎక్కడ ఉన్నా జాతర సమయంలో ఇక్కడకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఎప్పటిలాగే ఈసారి కూడా సమ్మక్క-సారలమ్మ జాతర సందడి మొదలైంది. ఈ నెల16 వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే జాతరకు కోటి 30 లక్షలకు పైగా భక్తులు మేడారానికి వస్తారని ప్రభుత్వం అంచనాలు వేసింది. అందుకు తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు చేస్తోంది.
సిద్ధబోయిన వంశస్థులు ఈ జాతర జరపడం వెనుక అసలు కథ ఏంటి ?
సమ్మక్క-సారక్క జాతర అంటే అందరికీ మేడారం మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ తెరవెనుక కథ వేరే ఉందంటున్నారు చరిత్రకారులు., స్థానికులు. ఈ జాతరను 1942కు ముందు వరకూ.. మేడారం పక్కనే ఉన్న బయ్యక్కపేట గ్రామంలో నిర్వహించేవారు. ఈ గ్రామాన్నే సమ్మక్క జన్మస్థలంగా భావించి ఆదివాసీ ఆచార సాంప్రదాయాలాతో మొదట్లో బయ్యక్కపేటలోనే నిర్వహించే వారని సమ్మక్క వంశీయులు, ఇక్కడి ఆదివాసీలు అంటుంటారు..
‘చందా’ వంశస్తులు సమ్మక్క తమ ఇంటి ఆడబిడ్డని వాళ్లు అంటారు.. .పెట్టేలో దొరికిన పసి కందును చేరదీసి యుక్త వయస్సు వచ్చేవరకు పెంచిపెద్ద చేశారు. అమ్మవారు కాబట్టి సామాన్య జనంలో ఉండలేక పక్కనే ఉన్న దేవరగుట్ట(సమ్మక్కగుట్టకు) పైకి వెళ్లిందని, అక్కడే అమ్మవారు అవసరాలు తీర్చేందుకు ఏర్పడిన బావిని జలకబావి అని పిలుస్తామని చెబుతారు.
సమ్మక్క పసితనంలో బయ్యక్కపేటలో పెరిగినా అంతర్దానమైంది మాత్రం మేడారం సమీపంలోని చిలుకల గుట్టపైనే. కాకతీయ సైన్యంతో వీరోచితంగా పోరాటం చేస్తూ ఈ గుట్టపైనే కనుమారుగై పోయారు. సమ్మక్క దేవత కోసం గాలిస్తున్న ఆదివాసీలకు కుంకుమ భరణి రూపంలో లభ్యమైందని అందుకే రెండేళ్ళ కోసారి మాఘ శుద్దపౌర్ణమి రోజు చిలుకలగుట్ట నుండి సమ్మక్కను కుంకుమ భరణి రూపంలో తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టించి జాతర జరుపుతారట..
సమ్మక్క పుట్టిన ఊరుగా చరిత్ర ప్రాశస్త్యంలో ఉన్న బయక్కపేట లోనే పూర్వకాలం నుండి ఒక గుడి ఉంది. ఇక్కడ చందా వంశస్తులు నిత్యం పూజలు నిర్వహిస్తారు. బయ్యక్కపేట పూజారులు చూపుతున్న ఆధారాలను బట్టి పూర్వం బయ్యక్కపేటలోనే సమ్మక్క జాతర నిర్వహించే వారని అర్థమవుతుంది. ఈ జాతరను చందా వంశస్థులయిన ఆదివాసీలు జరిపేవారు. చందా వంశీయులే ఇక్కడ ‘తలపతులు’గా వ్యవహరిస్తారు. అయితే జాతరను జరిపే చందా వంశస్థులు ఈ చుట్టుపక్కల కోయగూడేల్లోనూ ఉన్నారు.
బయ్యక్కపేట నుంచి మేడారనికి రావడానికి ఇదేనా కారణం?
బయ్యక్కపేటలో కరువు కాటకాల వల్ల జాతరను నిర్వహించే శక్తి సన్నగిల్లడం, దాయాదుల మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల సమ్మక్క జాతరను బయ్యక్క పేట నుంచి మేడారానికి మార్చారు. సమ్మక్క జాతరను మేడారానికి తరలించే ప్రక్రియలో జరిగిన లిఖిత పూర్వక హామీలు కూడా ఇప్పటికీ చందా వంశీయుల వద్ద ఉన్నాయి. ఈ లిఖిత పూర్వక ఒప్పందాల మేరకే చందా వంశీయులు మేడారం జాతర హుండీ ఆదాయంలో వాటా పొందుతున్నారు.
అలా సమ్మక్క జాతరను 1942లో మేడారానికి తరలించారుట. అప్పటి నుంచి మేడారంలో జాతర మొదలైంది. సమ్మక్క-సారక్క దేవతల మహత్యంతో లక్షలాది మంది తరిలివస్తుండడంతో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ జాతరను నిర్వహించడం మొద లేశారు..అప్పట్లో దీనిపై కోర్టు కేసుల వరకూ వెళ్లాయి. ఆ తర్వాత దేవాదాయశాఖ పరిధిలోనే జాతర నిర్వహిస్తున్నారు.
ఈ జాతర నిర్వాహణ కోసం ప్రభుత్వం రెండేళ్ల కోసారి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఈ సారి జాతరకు రూ.75 కోట్ల నిధులు వెచ్చించారు. కానీ ఆ వనదేవత జన్మస్థలంగా ప్రాశస్త్యం కలిగిన బయ్యక్కపేట పై మాత్రం సర్కార్ మోండిచేయే చూపుతుందని..స్థానికులు అంటున్నారు..వందల కోట్ల నిధులు, వేలాది మంది ఉద్యోగుల మ్యాన్ పవర్, ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇక్కడే తిష్టవేసి మేడారం జాతర జరుపుతున్నప్పటికీ బయ్యక్కపేటలోని సమ్మక్క దేవాలయం అభివృద్ధిపై శ్రద్ద చూపించకపోవడం..చాలా దారుణమని ఇక్కడి ప్రజలు, పూజారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమ్మక్క జన్మస్థలం కనీస అభివృద్దికి నోచుకోక పోవడం పట్ల ఇప్పటికే చందా వంశీయులు కోర్టును ఆశ్రయిస్తూనే ఉన్నారు…ఎందరికో ఇలవైల్పైనా ఈ దేవతలుకు ఆలయం లేకపోవడం..పట్ల చందా వంశీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-Triveni Buskarowthu