జలదిగ్బంధంలో మంథని పట్టణం.. ఎటూ చూసినా వరద నీరే?

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో లోతట్టు గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి. ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్దపల్లిలోని మంథని పట్టణం జల దిగ్బంధమైంది. మానేరు బ్యాక్ వాటర్, గోదావరిలో వరద నీరు భారీగా చేరుతోందని అధికారులు చెబుతున్నారు. అయితే వర్షాల కారణంగా మంథని ప్రధాన చౌరస్తాలోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. బొక్కలవాగు బ్యాక్ వాటర్‌తో పట్టణంలోని మర్రివాడ, అంబేడ్కర్ నగర్, దొంతలవాడ, వాసవీనగర్, లైన్ గడ్డలోని బర్రెకుంట, బోయిన్‌పేటలోని గ్రామాలు వరద నీటిలో మునిగాయి.

Manthani
Manthani

గ్రామాల్లో, ఇళ్లల్లో నీరు రావడంతో సామగ్రి తడిసి ముద్దయింది. కూరగాయల మార్కెట్‌లో, పోలీస్ స్టేషన్‌లో భారీగా వరద నీరు చేరింది. అలాగే పట్టణంలో పాత పెట్రోల్ బంక్ చౌరస్తాలోని ఇళ్లు నీట మునిగాయి. ఈ మేరకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు.