తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతాపార్టీ మధ్య మాటల యుద్ధానికి కాస్తంత విరామం దొరికింది. పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ప్రచారం కూడా సార్వత్రిక ఎన్నికాల ప్రచారాన్ని తలపించింది. టీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అనే రీతిలో ఢీకొంటూ ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చాయి. ఎవరికివారే గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
టీఆర్ ఎస్‌కు ప్రతిష్టాత్మకం
తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారంతో తెరపడింది. ఖమ్మం, హైదరాబాద్ పట్టభద్రుల స్థానాల పరిధిలో గత ఎన్నికలతో పోలిస్తే ఓటర్ల సంఖ్య, అభ్యర్థుల సంఖ్య పెరగడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చేదు ఫలితాలను రుచిచూసిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి మంత్రి గంగుల కమలాకర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి హరీశ్‌రావు, ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు మంత్రి నిరంజన్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. ఖమ్మం స్థానంలో ఆయా జిల్లాల మంత్రులకే బాధ్యతలు అప్పగించారు. ఎన్నికలు జరుగుతున్న ఉమ్మడి ఆరు జిల్లాల్లోని పార్టీ నేతలు, ఇతర ప్రజాప్రతినిధులను టీఆర్ ఎస్ మొహరించింది.
కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌కు మద్దతుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచంద్రరావు, ప్రేమేందర్‌రెడ్డి తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు. హైదరాబాద్ నియోజకవర్గంలోని తొమ్మిది జిల్లాల పరిధిలో 5.32 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
బీజేపీ లక్ష్యంగా కేటీఆర్ దాడి
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ సమావేశాల్లో పాల్గొన్న ఐటీ మంత్రి కేటీఆర్ బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారు. తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఓటర్లవద్దకు తీసుకువెళ్లారు. కేటీఆర్, బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం జరగడంతో రాజకీయ వాతావరణం కూడా ఒక్కసారిగా వేడెక్కింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయాన్ని కేటీఆర్ తన ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. తమకు అలాంటి కష్టం వస్తే మద్దతుగా రావాలని కోరారు. విభజన హామీల అమలుపై బీజేపీని కేటీఆర్ నిలదీశారు. పెట్రో ధరల పెరుగుదలను టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అస్త్రాలుగా మలుచుకున్నాయి.
కోదండరాంకు కత్తిమీద సాము
ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మం స్థానం నుంచి పోటీచేస్తున్న కోదండరాంకు తెలుగుదేశం, న్యూడెమోక్రసీ మద్దతు పలికాయి.కోదండరాంకు ప్రతికూల ఫలితం వస్తే రాష్ట్రంలో టీజేఎస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులున్నాయని చెప్పవచ్చు. ఇది టీఆర్ ఎస్‌కు సిట్టింగ్ సీటు కావడంతో ఆ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. దీనికి తోడు 71 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండడం, కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులు, వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, తీన్మార్ మల్లన్న, యువ తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఉండటంతో వ్యతిరేక ఓటులో వచ్చే చీలికపైనే కోదండరాం విజయావకాశాలు ఆధారపడివున్నాయని చెప్పవచ్చు.