ఇండియాలో కొన్ని వేల సంఖ్యలో ఆలయాలు ఉన్నాయి. దేవుళ్లు నమ్మేవారు..కోట్లమందే ఉన్నారు. ఎవరికివారు తమ ఇష్టదైవాన్ని ప్రార్థించి..మొక్కులు మొక్కుకోని తమకు తోచినంత కానుకలు ఇస్తుంటారు. నిజానికి ఏ దేవుడు తనకు డబ్బులు ఇస్తేనే..మీ కోరికలు తీరుస్తా అని చెప్పలేదు. కానీ మానవులకు ఏదైనా డబ్బుతో కొనటం అలవాటైపోయింది. గుళ్లో హుండిలో వేలకు వేలు డబ్బులు వేస్తారుకానీ..అదే గుడిబయట అన్నమో రామచంద్రా అని అడుక్కునే వారికి పదిరూపాయిలు వేయడానికి ఆలోచిస్తారు. అయితే అందరూ ఇలానే ఉంటారని లేదు. కొందరు ఇస్తారు..రూపాయో లేదా రెండురూపాయిలో. మీలో ఎంత మంది ఉన్నారు..గుడి హుండిలో కాకుండా..బిచ్చగాడి ప్లేట్ లో డబ్బులు వేసినవారు. సరే..ఈ విషయం పక్కన పెడితే..దేవుళ్లకు కానుకల రూపంలో వచ్చిన డబ్బు, బంగారం, ఇతర వస్తువులు దేవాలయానికి ఆదాయంగా మారుతుందనే విషయం మనందరికి తెలుసు. ఈ క్రమంలో సంపన్న దేవాలయాలు ఏవో, వాటి సంపంద ఏంతో ఇప్పుడు చూద్దాం.
అనంత పద్మనాభస్వామి దేవాలయం – తిరువనంతపురం
కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న పద్మనాభస్వామి ఆలయం దేశంలోనే అత్యంత సంపన్న దేవాలయంగా పేరు ఉంది. ఈ ఆలయం గురించి తెలియనివారంటూ ఎవరూ ఉండరేమో కదా. ఒకప్పుడు ఈ ఆలయం తిరువనంతపురం ట్రావెన్‌కోర్ రాజులు ఏలుబడిలో వుండేది. కొంతకాలం కిందట ఆ ఆలయంలో ఉన్న నేలమాళిగల్లో నిధి ఉన్నట్లు కూడా గుర్తించారు. వాటిలో కొన్ని గదులను తెరవగా.. రూ. వేలకోట్లు విలువ చేసే ఆభరణాలు బయటపడ్డాయి. మరొక గదికి నాగబంధనం ఉండటంతో పండితులు తెరవకూడదన్నారు. అందులో అనంత సంపద ఉన్నట్లు అందరూ భావిస్తున్నారు. ఆ సంపద విలువ కనీసం రూ.1.63లక్షల కోట్లు ఉంటుందని అంచనా.
వేంకటేశ్వరస్వామి ఆలయం – తిరుమల
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుమల శ్రీనివాసుని లీలలు అందరికీ తెలిసిందే. ఆ గుడిలో అడుగుపెట్టడంతోనే..మనసుకు ప్రశాంతగా..చుట్టు గోవిందనామస్మరణతో మారుమోగే ఆ ప్రాంతం మనకు హాయిగా ఆధ్యాత్మిక భావనను కలిగిస్తుంది. ఆలయం దేశంలోనే ఎక్కువ మంది భక్తుల తాకిడి ఉన్న దేవాలయం. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం నిత్యం సగటున 70వేల మంది వస్తుంటారు. కలియుగ దైవంగా కొలిచే శ్రీవారికి భక్తులు భారీగానే కానుకలు సమర్పిస్తుంటారు. ప్రస్తుతం కరోనా కారణంగా భక్తుల సంఖ్య, ఆదాయం తగ్గింది కానీ.. సాధారణంగా ఏటా రూ.650కోట్లు భక్తుల కానుకల రూపంలో వస్తాయి.
వైష్ణో దేవి – జమ్ముకశ్మీర్
శక్తిపీఠాల్లో అత్యంత శక్తివంతమైన దేవాలయం వైష్ణోదేవి ఆలయం. ఇది జమ్ముకశ్మీర్‌లోని కత్రా ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయానికి దేశవిదేశాల నుంచి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. ఏటా వైష్ణోదేవీ ఆలయానికి రూ. 500కోట్లు భక్తుల కానుకల రూపంలో అందుతాయి.
సాయి బాబా దేవాలయం – షిర్డీ
అత్యంత సంపన్న దేవాలయాల్లో మహారాష్ట్రలోని షిర్డీ సాయి బాబా ఆలయం ఒకటి. ఇక్కడికి హిందువులతోపాటు పలు మతాలకు చెందిన వారు కూడా సాయి బాబాను దర్శించుకుంటుంటారు. షిర్డీ సాయి సంస్థాన్ ఆధ్వర్యంలో నడిచే ఈ దేవాలయానికి ఏటా రూ.450కోట్లు ఆదాయం వస్తోంది. తెలుగు ప్రజలు జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలి అనుకునే ఆలయాల్లో ఇది కూడా ఒకటి.
సిద్ధి వినాయక ఆలయం – ముంబయి
ముంబయిలో ఎస్‌కే బోలె మార్గ్‌లో ఉన్న సిద్ధి వినాయక ఆలయం చాలా ఫేమస్. ఈ ఆలయంలోని సిద్ధి వినాయకుడిని దర్శించుకునేందుకు సాధారణ ప్రజల నుంచి సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులందరూ వెళ్తుంటారు. అతి సాధారణంగా కనిపించే ఈ ఆలయానికి ఏటా రూ.125కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా.
ఇవేకాకుండా తమిళనాడులోని మీనాక్షి అమ్మన్, ఒడిశాలోని పూరీ జగన్నాథ్, గుజరాత్‌లోని సోమనాథ్ దేవాలయాలకు కూడా రూ.కోట్లలో ఆదాయం ఉంటుందట.