తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. ఆయన విదేశీ పర్యటనలో ఉండగా ఇంటి తాళం పగులగొట్టి బంగారు,వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే, చోరీకి పాల్పడిన నిందితులను పోలీసులు బెంగాల్‌లో అరెస్ట్ చేశారు.ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్ ఏడో నంబర్ ప్లాట్‌ఫాంపై జీఆర్పీ పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్న టైంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని విచారించగా నిందితులు బిహార్‌కు చెందిన రోషన్‌కుమార్ మండల్, ఉదయ్‌కుమార్ ఠాకూర్‌గా పోలీసులు గుర్తించారు.
డిప్యూటీ సీఎం భట్టి ఇంట్లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని ఖరగ్‌పూర్ జీఆర్పీ ఎస్పీ దేబశ్రీ సన్యాల్ తెలిపారు. వారి నుంచి రూ.2.2 లక్షల నగదు, 100 గ్రాముల బంగారు నాణెం, కొంత విదేశీ కరెన్సీ, పెద్ద మొత్తంలో ఆభరణాలు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకున్నట్లు బెంగాల్ పోలీసులు తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.బంజారాహిల్స్ పీఎస్ ఈ చోరీకి సంబంధించి రోషన్ కుమార్ మండల్ పేరుతో కేసు నమోదైనట్లు గుర్తించారు. నిందితులను శనివారం ఖరగ్‌పూర్ కోర్టులో హాజరుపరచనున్నారు.