హిందూపురం నుంచి కదిలే ప్రసక్తే లేదని పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. టికెట్ ఇచ్చినా, ఇవ్వకున్నా హిందూపురం ఎంపీ, ఎమ్మెల్యేగా ఇండిపెంటెండ్ గా పోటీ చేసి తీరుతానని తేల్చి చెప్పారు. స్వామిజీ అయిన తనకు టికెట్ ఇస్తే.. ముస్లింల ఓట్లు పోతాయని చంద్రబాబు బీజేపీ పెద్దలకు చెప్పారని తెలిపారు. ముస్లింల ఓట్ల కోసం జనాభాలో ఎక్కువ శాతం ఉన్న హిందువుల ఓట్లు తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
‘నేను హిందూపురం నుంచి ఎంపీ, ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వమని అడిగేందుకే పురందేశ్వరిని కలిశాను. టీడీపీ, జనసేనలతో పార్టీలతో పొత్తు కుదరడానికి ముందు నుంచే బీజేపీ హిందూపురం ఎంపీగా పోటీ చేయాలని నేను పని చేస్తున్నా. నా అభిప్రాయం అధిష్టానానికి తెలపడానికే వచ్చాను’ అని చెప్పారు. ఉదయం వచ్చిన వాళ్లు మధ్యాహ్యానికే అభ్యర్థులైపోతారా..? అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. పొత్తు కారణంగా ప్రస్తుతం బీజేపీ కూడా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉందన్నారు. ఏది ఏమైనప్పటికీ తాను హిందూపురం నుంచి పోటీ చేయడం ఖాయమని తేల్చి చెప్పారు