వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదని పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హన్మకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోయిందని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకుందని ఆరోపించారు. పదేళ్లలో తెలంగాణలో అభివృద్ధి జరగలేదని.. కేవలం దోపిడీనే జరిగిందన్నారు. గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలనను అందిస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలం చెందిందన్నారు. అధికారం కోల్పోయామనే అసహనంతో కేటీఆర్ మాట్లాడుతున్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాల కంటే ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది. మిగతా రాష్ట్రాల్లో కూడా తెలంగాణ తరహా పథకాలు అమలు కావాలని అడుగుతున్నారు. కులగణనతో దేశానికే రోల్ మోడల్ గా తెలంగాణ నిలుస్తోంది అన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో బీఆర్ఎస్ నేతలతో చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు. వరంగల్ విజయోత్సవ సభకు ఇందిరా మహిళా శక్తి సభగా నామకరణం చేశామని తెలిపారు.