న్యూ ఇయర్ నుంచి ఈ 7కొత్త రూల్స్..వీటి ప్రభావం ఎంతంటే ?

-

జనవరి 1 నుంచి మీ వాట్సాప్ పనిచేస్తుందా.. కొత్త ఏడాదిలో కొత్త కారు కొనాలంటే మరింత భారం అవుతుందా? న్యూ ఇయర్ లో మీ కారు టోల్ గేట్ దాటి వెళ్లాలంటే ఏం కావాలి ? వ్యాపారులు జీఎస్టీ ఎన్నిసార్లు కట్టాలి? ఇలాంటి అనేక మార్పులు కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచే అమలుకానున్నాయి. ఈ మార్పులు ఎలా వస్తాయి..ఎందుకు వస్తున్నాయి వాటి ప్రభావం ఎంత?

కరోనా దెబ్బకు 2020 అత్యంత భయానకంగా గడిచింది. మొత్తానికి కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే న్యూఇయర్ మొదటి రోజు నుంచే చాలా మార్పులు రాబోతున్నాయి..ఇప్పటివరకు హైవేలపై దూసుకుపోయాం. టోల్ గేట్ దగ్గర క్యాష్ కట్టేసి వెళ్లిపోయేవాళ్లం..కానీ ఇకముందు అలాంటి అవకాశం లేదు..టోల్గేట్ దగ్గర డబ్బులిస్తే తీసుకోరు. నో క్యాష్.. అలాగని కార్డు పేమెంట్ కు కూడా అవకాశం లేదు..
టోల్ ప్లాజా గేటు తెరుచుకోవాలంటే మన దగ్గర ఒక ఆయుధం ఉండాలి..అదే ఫాస్టాగ్. జనవరి 1తర్వాత అన్ని ఫోర్ వీలర్లకు కచ్చితంగా ఉండాల్సిందనని కేంద్రం ఇప్పటికే ఆదేశాలిచ్చేసింది. 2016లోనే ఫాస్టాగ్ వచ్చినా అనేక వాయిదాల తర్వాత ఇప్పుడు కంపల్సరీగా మారుతోంది.

2021లో మీ ఫోన్ లో వాట్సాప్ పనిచేస్తుందా..లైట్ తీసుకుంటే మీ ఫోన్ లో వాట్సాప్ పనిచేకపోవచ్చు. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అప్ డేట్ల్ తో వస్తున్న వాట్సాప్… ఏటా కొన్నిడివైజ్ లకు సపోర్ట్ నిలిపివేస్తోంది. ఫలితంగా ఆ ఫోన్ లలో వాట్సాప్ ఉపయోగించే అవకాశం ఉండదు. లాస్టియర్‌ ఐఓఎస్ 8.0 కన్నా తక్కువ తక్కువ వెర్షన్ కలిగిన యాపిల్ ఐఫోన్లకు, ఆండ్రాయిడ్ 2.3.7 వెర్షన్ కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్లకు వాట్సాప్ పనిచేయటం ఆగిపోయింది. వచ్చే జనవరి 1 నుంచి మరికొన్ని ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ ఆగిపోనుంది. అంటే ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదన్నమాట..2021 నుంచి ఐఫోన్ లలో వాట్సాప్ ను వాడుకోవాలంటే వాటిల్లో ఐఓఎస్ వెర్షన్ కనీసం 9.0 లేదా ఆపైన ఉండాలి.అదే ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఓఎస్ వెర్షన్ 4.0.3 ఆపైన ఉండాలి.ఈ ఫోన్ లలోనే వాట్సాప్ పనిచేస్తుంది. అంటే, ఐఫోన్ 4,4ఎస్, 5,5ఎస్, 5సి, 6,6ఎస్ లలో ఈ జనవరి1 నుంచి వాట్సాప్ పనిచేయదు.

ఇక డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ కు ఆదరణ ఏటా పెరుగుతోంది. ఇప్పటికే నెఫ్ట్, ఆర్టీజీఎస్ లావాదేవీలపై ఛార్జీలను కూడా ఆర్బీఐ ఎత్తివేసింది. డిజిటల్ పేమెంట్ యాప్ లతో పాటు, కార్డ్ లెస్ పేమెంట్ లు కూడా భారీగానే జరుగుతున్నాయి. ఇప్పటివరకు పిన్ ఎంటర్ చేయకుండా రూ.2వేల వరకు మాత్రమే లావాదేవీలకు అవకాశం ఉంది.అయితే జనవరి1 నుంచి ఎలాంటి పిన్ లేకుండానే రూ.5వేల వరకు ట్రాన్సాక్షన్ లకు అవకాశం రానుంది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం కస్టమర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండనుంది.

ఇక చెక్కుల ద్వారా జరిగే ట్రాన్సాక్షన్లకు కొత్త రూల్స్ వచ్చేశాయి. జనవరి1నుంచి చెక్ పేమెంట్ల కోసం పాజిటివ్ పే సిస్టమ్ అమలు కానుంది. ఈ సిస్టమ్‌ ప్రకారం చెక్ ఇచ్చిన కస్టమర్ వివరాలను బ్యాంక్ మరోసారి కన్ ఫమ్ చేసుకుంటుంది. అంటే చెక్కు ఇచ్చినప్పుడు.. చెక్ నంబర్, చెక్ తేదీతో పాటు, ఎవరిపేరున ఇస్తున్నామో వాళ్ల పేరు, ఎకౌంట్ నంబర్, అమౌంట్ మొదలైన వివరాలతో పాటు, చెక్కు రెండు వైపులా ఫొటోలను తీసి..బ్యాంకుకు ముందే అందించాలి. ఈ వివరాలతో చెక్కులను పోల్చి చూసి… రెండింట్లో వివరాలు ఒకేలా ఉంటేనే బ్యాంకులు ఓకే అంటాయి. రూ.50వేలు దాటిన చెక్ చెల్లింపులకు ఇది తప్పనిసరి కానుంది.

జనవరి నుంచి జీఎస్టీ చెల్లింపు విధానంలో కూడా మార్పులు రానున్నాయి. ఇప్పటివరకు నెలకు ఒకటి చొప్పున ఏడాదికి 12రిటర్న్స్ ఇవ్వాల్సి వస్తోంది. కానీ, ఈ జనవరి 1 నుంచి మూడు నెలలకోసారి అంటే ఏడాదికి నాలుగు రిటర్న్స్ ఫైల్‌ చేస్తే సరిపోతుంది. ఈ విధానం జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 94 లక్షల మంది చిన్న వ్యాపారస్థులకు ఇది ఉపయోగపడుతుంది. ఏడాదికి రూ.5 కోట్ల లోపు అమ్మకాలు ఉండే వ్యాపారాలు దీని కిందికి వస్తాయి.

ఇప్పటివరకు ల్యాండ్ లైన్ నుండి మొబైల్ కు కాల్ చేయాలంటే …జస్ట్ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. కానీ, జనవరి 1నుంచి ల్యాండ్ లైన్ నుంచి మొబైల్ కి ఫోన్ చేయాలంటే నంబర్ కు ముందు జీరో కచ్చితంగా ఎంటర్ చేయాలి. లేకపోతే నంబర్ కలవదు. అయితే, మొబైల్ నుంచి మొబైల్ కు చేయాలన్నా, ఫిక్స్ డ్ లైన్ నుంచి ఫిక్స్ డ్ లైన్ కు చేయాలన్పా నంబర్లలో ఎలాంటి మార్పు ఉండదు. ఈ కొత్త మార్పు వల్ల 2539 మిలియన్ ల నంబర్ సిరీస్ లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఏటా జనవరిలో కార్ల ధరలు పెరుగుతాయి. కానీ, ఈ సారి కోవిడ్‌ కష్టాలు కూడా తోడై మరింత ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. దేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ.. మోడల్ ను బట్టి రేట్లు పెంచనుంది. ఇండియాలో తమ కార్ల ధరలు పెంచనున్నట్లు ఇప్పటికే ఎంజీ మోటార్స్ ప్రకటించింది. హ్యుండయి, హోండా, మహీంద్రా, ఫోర్డ్‌, ఫోక్స్‌ వాగన్‌, నిస్సాన్‌ కంపెనీలు కూడా రేట్లు పెంచుతామని ప్రకటించేశాయి. రెనో కార్ల ధరలు రూ. 28 వేల వరకు పెరగనున్నాయి. కియా సెల్టోస్, సానెట్ ధరలు కూడా పెరగనున్నాయి. బీఎండబ్యూ, మిని కార్ల ధరలు 4శాతం వరకు పెరుగుతాయి. ఇక టూవీలర్ల ధరలు కూడా ఇదే రేంజ్‌ లో పెరుగుతాయని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news