కొత్త సంవత్సరం కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా..అయితే 2022లో వచ్చే ఈ అధునాతన ఫీచర్స్ ఉన్న ఫోన్ల గురించి ఓసారి చూడండి. టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాప్ ఫోన్‌లు ఇవే..
యాపిల్ ఐఫోన్ 14 (Apple iPhone 14)
యాపిల్ లవర్స్ కి ఇది శుభవార్తే.. వచ్చే ఏడాది యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ ఫోన్‌లు మంచి అప్‌గ్రేడ్లతో వస్తాయన్న అంచనాలతో టెక్ ప్రియుల్లో మరింత ఆసక్తిని నింపింది. ఐఫోన్ 14 ప్రో ఫోన్‌లు 48మెగాపిక్సెల్ కెమెరాలతో వస్తాయని సమాచారం. అలాగే ఐఫోన్ 14 సిరీస్ ఫోన్‌లన్నీ 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేలతో వచ్చే అవకాశం ఉంది.
సామ్‌సంగ్ ఎస్22 అల్ట్రా (Samsung Galaxy S22 Ultra)
గెలాక్సీ నోట్ సిరీస్‌ను ఆపేసిన సామ్‌సంగ్… వచ్చేఏడాదిలో దాని ప్రత్యేక ఫీచర్లను పొందుపరిచి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను తీసుకురానుంది. బుల్ట్ ఇన్ ఎక్స్ పెన్ తో పాటు అధునాతన స్నాప్‌డ్రాగన్, ఎజ్సినోస్ ప్రాసెసర్‌ల వేరియంట్లలో ఇది రానుంది. అలాగే గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా కొత్త కెమెరా సెటప్ తో వస్తుంది.
ఒప్పో ఫైండ్ ఎన్ (Oppo Find N)
2022లో ఒప్పో తన మొదటి ఫోల్డబుల్ ఫోన్ తీసుకురానుంది. ఒప్పో ఫైండ్ ఎన్ పేరుతో ఇది రానుంది. మోటోరాలా, హువావే, సామ్‌సంగ్ ఫోల్డబుల్ మొబైల్‌లకు ఇది గట్టి పోటీని ఇచ్చేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఒప్పో ఫైండ్ ఎన్ డిజైన్ ఆకట్టుకునేలా ఉంది.
యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 5జీ (Apple iPhone SE 5G)
ఎస్ఈకి సక్సెసర్ గా వచ్చే ఏడాది ఐఫోన్ ఎస్ఈ 5జీ ఫోన్ తీసుకురానుంది యాపిల్. ఏ15 బియోనిక్ 5జీ ప్రాసెసర్‌తో ఇది నడవనుంది. ఈ ఫీచర్ మినహా ఐఫోన్ ఎస్ఈలో ఉండే ఫీచర్లతోనే ఎస్ఈ 5జీ లాంచ్ కానుంది.
ఐక్యూ 9 (iQOO 9)
120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో వస్తుందన్న అంచనాలు ఉన్న ఐకూ 9 కోసం టెక్ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా విభిన్నమైన డిజైన్ తో ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంతో రావటంతో అందిరిలో ఆసక్తి నెలకొంది.
గూగుల్ పిక్సెల్ 6ఏ (Google Pixel 6A)
గూగుల్ పిక్సెల్ 5ఏ ఫోన్‌కు సక్సెసర్ గా 2022లో రానుంది పిక్సెల్ 6ఏ. పిక్సెల్ 5ఏ అన్ని దేశాల్లో ఇంకా విడుదల కాకపోయినా.. పిక్సెల్6ఏ ఫోన్‌ను భారత్‌కు గూగుల్ తీసుకొచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. గూగుల్ టెన్సార్ జీఎస్101 ఎస్ఓసీ ప్రాసెసర్‌తో రానుంది.
షియామీ 12 (Xiaomi 12)
వచ్చే ఏడాది రానున్న మరో ఆసక్తికరమైన ఫ్లాగ్‌షిప్ మొబైల్ షియామీ 12. ఎంఐ బ్రాండింగ్ ను తొలగించి ఈ ఫోన్ తీసుకురానుంది షియామీ. ఈ ఫోన్ కూడా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 అధునాతన ప్రాసెసర్‌తోనే నడవనుంది.
వీటిల్లో మీరు ఎదురుచూస్తున్న ఫోన్ ఏదైనా ఉందామరీ..!
– Triveni Buskarowthu