వరల్డ్ కప్ 2019 ఫైనల్.. ఆ రెండు తప్పులే న్యూజిలాండ్ కొంపముంచాయా..?

-

లండన్‌లోని లార్డ్స్ మైదానంలో నిన్న ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ వెంట్రుక వాసిలో వరల్డ్‌కప్‌ను మిస్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేసిన పలు తప్పిదాలే ఆ జట్టును ఓటమిపాలు చేశాయని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో న్యూజిలాండ్ ఫీడర్లు చేసిన రెండు పొరపాట్ల కారణంగా ఆ జట్టు వరల్డ్ కప్‌ను కొంచెంలో చేజార్చుకుంది.

These are the two mistakes that newzealand did in world cup final 2019

న్యూజిలాండ్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ చివరికి 12 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి వచ్చింది. క్రీజులో బెన్‌స్టోక్స్ మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 49వ ఓవర్‌లో వేసిన 4వ బంతికి స్టోక్స్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే బంతి బౌండరీ దగ్గర ఉన్న ట్రెంట్ బౌల్ట్ చేతుల్లో పడింది. కానీ బౌల్ట్ క్యాచ్ పట్టినా ఆ ఊపును తమాయించుకోలేక వెనుకకు అడుగులు వేశాడు. దీంతో బంతి బౌల్ట్ చేతుల్లో ఉండగానే అతని కాళ్లు బౌండరీ లైన్‌ను తాకాయి. ఈ క్రమంలో అంపైర్లు దాన్ని సిక్సర్‌గా ప్రకటించారు. అయితే ట్రెంట్ బౌల్ట్ గనక ఆ క్యాచ్ పట్టి ఉంటే స్టోక్స్ అవుటయ్యేవాడు. అదే జరిగి ఉంటే మ్యాచ్ ఫలితం న్యూజిలాండ్‌కు అనుకూలంగా వచ్చేది. కానీ న్యూజిలాండ్ ఫీల్డర్ ట్రెంట్ బౌల్ట్ చేసిన తప్పిదం వల్ల ఇంగ్లండ్ అప్పుడు బతికిపోయింది.

ఆ తరువాత ఇంగ్లండ్ చివరి ఓవర్‌లో 6 బంతుల్లో 15 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ ఓవర్‌లో 4వ బంతిని స్టోక్స్ మిడ్ వికెట్ దిశగా ఆడి ఒక పరుగును పూర్తి చేసి రెండో పరుగు కోసం యత్నించాడు. అయితే బంతిని అందుకున్న న్యూజిలాండ్ ఆటగాడు గప్తిల్ స్టోక్స్‌ను రనౌట్ చేద్దామని చెప్పి బంతిని కీపర్ వైపుకు విసిరాడు. కానీ అదే సమయంలో రనౌట్ నుంచి తప్పించుకోవడం కోసం స్టోక్స్ క్రీజులోకి బ్యాట్‌తో రెండు చేతులను ముందుకు చాపి డైవ్ చేశాడు. ఈ క్రమంలో బంతి స్టోక్స్‌ను తాకి బౌండరీకి తరలివెళ్లింది. అలా ఆ బంతికి ఇంగ్లండ్‌కు వారు చేసిన 2 పరుగులతోపాటు మరో 4 పరుగులు ఓవర్ త్రోల రూపంలో కలిపి మొత్తం ఒకే బంతికి 6 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్ చివరికి మ్యాచ్‌ను టైగా ముగించింది. అయితే ఈ రెండు తప్పులు గనక జరగకుండా ఉంటే కచ్చితంగా న్యూజిలాండ్ జట్టే వరల్డ్ కప్‌ను గెలిచి ఉండేదని మాజీలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా.. ఈ మ్యాచ్ కివీస్ ఆటగాళ్లకు మాత్రం తీవ్ర విచారాన్నే మిగిల్చిందని చెప్పవచ్చు..!

Read more RELATED
Recommended to you

Latest news