“మా నాయకుడు అసాధ్యుడే. ఏమో అనుకున్నాం కానీ, ఇలా కూడా చేశారే!“- ఇదీ ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా టీడీపీలోని ఏ ఇద్దరు నాయకులు కలిసినా చర్చించుకుంటున్న విషయం. మరి ఇంతకీ ఈ జిల్లాలో ఏం జరిగింది? ఏం జరిగితే.. ఇంతగా చర్చించుకుంటున్నారు? అనే ప్రశ్నలు ఉదయిస్తాయి కదా? దీనికి సమాదానమే ఈ స్టోరీ. రాష్ట్రంలో 2014లో మౌఖిక పొత్తు పెట్టుకున్న జనసేన-టీడీపీలు 2019 ఎన్నికలకు వచ్చే సరికి పూర్తిగా వేర్వేరుగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అప్పటి వరకు టీడీపీ పాట పాడిన జనసేనాని పవన్ కళ్యాణ్.. చంద్రబాబుపైనా ఒకింత వ్యతిరేకత చూపించారు. ఆ తర్వాత ఆయన ప్లేట్ మార్చి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన తన పొత్తు పార్టీ బీజేపీతో కలిసి..పోటీ చేస్తున్నారు. అయితే, ఇంత వరకు అందరికీ తెలిసిందే.
కానీ, తూర్పులో మాత్రం చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ టీడీపీ-జనసేనలు అనధికార పొత్తుతో ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యాయి. అమలాపురం, అల్లవరం, ఉప్పల గుప్తం మండలాలనే తేడా లేకుండా అన్నిచో ట్లా స్థానిక సంస్థలఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు తెరవెనుక పొత్తులు పెట్టుకుంటున్నాయి. ‘మీకు ఇది…మాకు ఇది’ అనే పద్ధతిలో ‘జెడ్పీటీసీ మీకు…ఎంపీపీ మాకు…ఒక ఎంపీటీసీ మీకు.. ఒక ఎంపీటీసీ’ మాకు అంటూ వాటాలు పంచుకున్నట్టు ఎంపీటీసీ స్థానాలు పంచుకుంటున్నాయి. గత సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం..ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల నేపథ్యంలో గెలుపు దీమా లేక ఇరుపార్టీలు ఇలా స్థానాలు పంచుకున్నాయి.
టీడీపీ అగ్రనేతలు జనసేనతో పొత్తు ఉండదని ఒకవైపు చెబుతూనే మరోవైపు ఇలా తెరవెనుక రాజకీయాలకు పాల్పడుతు న్నారు. ఉప్పలగుప్తం మండలంలో ఒక్క విలసవిల్లి ఎంపీటీసీ స్థానానికే కాదు ఈ మండలంలో ఉన్న ఎంపీటీసీ స్థానాలన్నింటినీ ఈ రెండు పార్టీలు పంచుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి. విలసవిల్లితోపాటు పక్కనే ఉన్న భీమనపల్లిలో ఒక ఎంపీటీసీ స్థానాన్ని టీడీపీకి వదిలేయాలని జనసేన నిర్ణయించుకుంది. మునిపల్లి, వానపల్లిపాలెం కలిపి ఉన్న ఎంపీటీసీ స్థానంలో జనసేనకు వదిలేయాలని టీడీపీ తీర్మానించింది. మండలంలో మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలుండగా వైఎస్సార్సీపీ 17చోట్ల నామినేషన్లు వేసింది. టీడీపీ తరఫున 13 మంది, జనసేన తరపున తొమ్మిది చోట్ల తమ అభ్యర్థులను నిలిపారు. మూడు స్థానాల్లో అనధికారికంగా పొత్తు కుదుర్చుకోగా, మరో ఐదు చోట్ల కుదిరే అవకాశముందని సమాచారం.
అమలాపురం మండలంలో జి.అగ్రహారం ఎంపీటీసీ స్థానంలో టీడీపీకి జనసేన మద్దతు ఇస్తుంది. ఇందుపల్లిలో జనసేనకు టీడీపీ మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. బండారులంకలో మూడు ఎంపీటీసీలు ఉండగా, రెండు చోట్ల టీడీపీ, ఒక చోట జనసేన పరస్పరం సహకరించుకోనున్నాయి. ఈదరపల్లిలో ఒక స్థానంలో టీడీపీ, మరో స్థానంలో జనసేన పంచుకున్నాయి. పేరూరులో నాలుగు స్థానాలకుగాను టీడీపీ రెండు, జనసేన రెండు చొప్పున పంచుకున్నారు. జనుపల్లిలో టీడీపీ, జనసేన ర్యాలీగా కలిసి వచ్చి జనసేన అభ్యర్థికి మద్దతుగా నామినేషన్ వేయగడం గమనార్హం. అల్లవరం మండలం డి.రావులపాలెం ఎంపీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి తిక్కా శేషుబాబుకు మద్దతు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. సో.. మొత్తానికి ఇదీ విషయం!!