వర్షాలు పడడం లేదని.. ఆ గ్రామాల్లో యువకులకు పిల్లనివ్వడం లేదు..!

-

మహారాష్ట్రలోని పలు మారుమూల గ్రామాల్లో వింత పరిస్థితి నెలకొంది. కరువు కారణంగా చాలా మంది యువకుల‌కు వివాహాలు కావడం లేదు.

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింద‌న్న చందంగా.. మహారాష్ట్రలో యువకులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు వర్షాలు లేక కరువుతో అల్లాడిపోతుంటే.. మరోవైపు యువకులు ఏజ్ బార్ అవుతున్నా పెళ్లిళ్లు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలోని పలు మారుమూల గ్రామాల్లో వింత పరిస్థితి నెలకొంది. కరువు కారణంగా చాలా మంది యువకుల‌కు వివాహాలు కావడం లేదు. దీంతో తాము బ్రహ్మచారులుగానే జీవితాంతం ఉండిపోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మహారాష్ట్రలోని ప‌టోడా తాలూకా బీడ్‌ అనే ప్రాంతం నుంచి సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుస్న‌ర్‌వాడీ, దొమ‌రి, దిస‌ల్‌వాడీ, డొమ్రి తదితర గ్రామాల్లో ఈ ఏడాది జూన్ 1 నుంచి జూలై 11వ తేదీ వరకు 128.5 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. గ‌త‌ ఏడాది ఇక్కడ 169.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనా వర్షాలు సరిగ్గా కుర‌వ‌డం లేదు. దీంతో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో ఆయా గ్రామాలు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.

వర్షాలు లేక కరువు రావడం వల్ల చేసేందుకు పని ఏమీ దొరక్కపోవడంతో యువకులు ఖాళీ గా ఉంటున్నారు. దీంతో అలాంటివారికి పిల్లను ఇచ్చేందుకు తల్లిదండ్రులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఆయా గ్రామాల్లో చాలామంది యువ‌కులు వివాహ‌ వయస్సు దాటిపోతూ బ్రహ్మచారులు గానే ఉంటున్నారు. కాగా ఆయా గ్రామాల్లో 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సున్న బ్రహ్మచారులు 200 మంది వరకు ఉన్నార‌ని తెలిసింది. వీరు గత రెండు, మూడు సంవత్సరాల నుంచి వివాహం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ వీరు ఏ ప‌నీ లేక‌ ఖాళీగా ఉండడంతో వీరికి పిల్ల‌ను ఇచ్చి వివాహం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

అయితే ఈ గ్రామాల్లో ఉన్నవారంతా ధంగ‌ర్‌, మ‌రాఠా వర్గాలకు చెందిన వారు కావడంతో ఇతర వర్గాలకు చెందిన యువతులను పెళ్లి చేసుకునేందుకు వీరి ఆచారాలు, సంప్రదాయాలు అంగీకరించవు. దీంతో ఈ గ్రామాల్లో ఉండే యువకులు పెళ్లిళ్లు కాక బ్రహ్మచారులుగానే ఉండిపోతున్నారు. ఇక ఈ గ్రామాలను విడిచి పట్టణాలు, నగరాలకు వెళ్లి యువకులు ఎలాగో బతికేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయా గ్రామాల్లో ఉంటున్న యువకులు కూడా పట్టణాలు, నగరాలకు వలస వెళితే బాగుంటుంద‌ని, పని చేసుకోవచ్చ‌ని, వివాహం కూడా జరుగుతుందని భావించి గ్రామాలను వదిలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మ‌రి ముందు ముందు దేశంలో వ‌ర్షాభావ ప‌రిస్థితులు నెల‌కొంటే.. ఇంకిలాంటి ఆవేద‌న‌ల‌ను ఎన్నింటిని చూడాల్సి వ‌స్తుందో..! అంద‌రినీ ఆ దేవుడే కాపాడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news