తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన దుర్గ గుడి వెండి రధం సింహాలు చోరీ కేసుని ఎట్టకేలకు పోలీసులు చేధించారు. నిందితుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గొల్లవానితిప్పకు చెందిన సాయిబాబా అని గుర్తించారు. సాయి బాబా భీమవరం, తాడేపల్లి గూడెం, నిడదవోలు లాంటి చాలా చోట్ల ఆలయాల్లో చోరీ చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు అని కూడా పోలీసులు గుర్తించారు. 2012లో చివరి సారిగా సాయిబాబా పోలీసులకు పట్టుబడ్డట్టు చెబుతున్నారు.
ఈ రోజు రేపట్లో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక మరో పక్క కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో నంది విగ్రహం ధ్వంసం కేసును కూడా పోలీసులు చేధించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసింది గుప్తనిధుల ముఠా అని గుర్తించారు. మక్కపేట కాశీవిశ్వేశ్వర ఆలయంలో సెప్టెంబర్ 16వ తేదీన నంది విగ్రహం ధ్వంసం అయింది. తెలంగాణాకు చెందిన ఆరుగురు సభ్యుల గుప్తనిధుల ముఠా దీనికి కారణంగా గుర్తించి పోలీసులు వారిని అరెస్టు చేశారు.