కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే మాస్కులు ధరించకుండా బయటకు వచ్చే వారిపై జరిమానా విధిస్తున్నారు. ఒక్కో రాష్ట్రంలో జరిమానా ఒక్కో విధంగా ఉంది. అయితే మాస్కులు ధరించకపోతే కేవలం సామాన్య పౌరులకే కాదు, అందరికీ శిక్ష పడాల్సిందేనని ఆ పోలీసు ఉన్నతాధికారి చాటి చెప్పారు. చట్టం ముందు అందరూ సమానమే అని.. ఎవరు నిబంధనలను ఉల్లంఘించినా తగిన జరిమానా చెల్లించాల్సిందేనని.. అన్నారు. మాస్కు ధరించకుండా బయట తిరిగినందుకు గాను ఆయన జరిమానా చెల్లించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
కాన్పూర్ రేంజ్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మోహిత్ అగర్వాల్ బహిరంగ ప్రదేశంలో మాస్కు లేకుండా తిరిగినందుకు గాను జరిమానా చెల్లించారు. తనకు తానుగా ఆ జరిమానా విధించుకున్నారు. కాన్పూర్‌లోని బర్రా పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశంలో నిర్వహించిన తనిఖీల్లో పాల్గొన్న మోహిత్ అగర్వాల్ మాస్కు లేకుండా తిరిగారు. వెంటనే తాను మాస్కు ధరించలేదనే విషయాన్ని గ్రహించిన ఆయన తన వాహనం వద్దకు వెళ్లి అందులో ఉన్న మాస్క్ బయటకు తీసి ధరించారు. తరువాత స్థానిక సీఐ రంజిత్ సింగ్ చేత జరిమానా రశీదు రాయించుకుని వెంటనే రూ.100 జరిమానా చెల్లించారు.
कल बर्रा थाना क्षेत्र मे भ्रमण दौरान गाड़ी से उतरते वक़्त IG रेंज द्वारा मास्क धारण नहीं किया गया था,यद्यपि कुछ ही सेकेन्ड मे उन्होने मास्क पहन लिया, फिर भी उन्होंने स्वयं चालान करवाया व जुर्माना राशि जमा की ताकि जनता व अन्य पुलिस कर्मियों में मास्क पहनने की जागरूकता पैदा हो । pic.twitter.com/ZlVIg1M4D8
— IG RANGE KANPUR (@igrangekanpur) June 6, 2020
ఈ సందర్భంగా మోహిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశంలో చెకింగ్‌కు వచ్చానని, మాస్క్ లేకుండా కొంత సేపు బయట తిరిగానని, అయితే వెంటనే మాస్క్ ధరించలేదని గుర్తుకు వచ్చి, వాహనంలో ఉన్న మాస్క్ తీసి ధరించానని ఆయన చెప్పారు. మాస్క్ ధరించకపోతే రూ.100 జరిమానా ఉందని, పోలీస్ అధికారులమై ఉండి తామే నిబంధనలను పాటించకపోతే ఇక ప్రజలు ఎలా పాటిస్తారని, అందుకనే రూ.100 జరిమానా విధించుకుని చెల్లించానని.. ఆయన తెలిపారు. కాగా ఆయన చేసిన పనిని అందరూ అభినందిస్తున్నారు.