భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి తమ వంటకాల్లో ఉల్లిపాయలను ఉపయోగిస్తున్నారు. ఉల్లిపాయలు వేయనిదే ఏ కూరను వండరు. కొందరు పచ్చి ఉల్లిపాయలను అలాగే తింటుంటారు. ఇక నాన్‌వెజ్ వంటకాలు అయితే ఉల్లి నోట్లో పడాల్సిందే. అయితే చలికాలంలో మాత్రం ఉల్లిపాయలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా తినాల్సిందే. ఎందుకంటే..
ఆయుర్వేద ప్రకారం ఉల్లిపాయలు సహజంగానే వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. కనుక చలికాలంలో వీటిని తింటే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. చైనీయులు ఈ సీజన్‌లో ఉల్లిపాయలను ఎక్కువగా తింటారు. వారు ఉల్లిపాయలను పవర్ హౌజ్ ఆఫ్ ఎనర్జీ.. అంటే శక్తికి పుట్టినిల్లు అని భావిస్తారు. అందువల్ల ఉల్లిపాయలను చలికాలంలో కచ్చితంగా తీసుకోవాలి.
ఉల్లిపాయల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల చలికాలంలో సహజంగానే ఇబ్బందులకు గురి చేసే దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ, చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
పచ్చి ఉల్లిపాయలను అలాగే తినడం వల్ల దంతాలు, నోరు శుభ్రంగా మారుతాయి. చిగుళ్లకు ఇన్‌ఫెక్షన్ రాకుండా ఉంటుంది. నోటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
2008 నుంచి 2014 సంవత్సరాల మధ్య నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలిందేమిటంటే.. పచ్చి ఉల్లిపాయలను తినే మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని గుర్తించారు.
అధిక బరువు సమస్యతో బాధపడేవారికి ఉల్లిపాయలు చక్కని ఆహారం అని చెప్పవచ్చు. వీటిల్లో ఫైబర్, ప్రీ బయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగులకు ఎంతగానో మేలు చేస్తాయి. శరీరం మనం తినే ఆహారాల్లోని కాల్షియంను సరిగ్గా శోషించుకోవాలంటే ఉల్లిపాయలను తినాలి. ఎరుపు రంగు ఉల్లిపాయల్లో క్వర్సెటిన్ అనబడే ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో పలు భాగాల్లో కొవ్వు చేరకుండా చూస్తాయి. అందువల్ల చలికాలంలో సహజంగానే ఎక్కువగా పేరుకుపోయే కొవ్వు సమస్యకు చెక్ పెట్టవచ్చు.