బట్టల దుకాణాలు, షాపింగ్ మాల్స్‌లలో లుంగీలు కొనాలంటే రూ. 200– 800 ధర పలుతాయి. కానీ అక్కడ ప్రారంభ ధర రూ. 2000 లతో మొదలై రూ. లక్ష వరకు పలుకుతాయి. ఏంటి.. లుంగీకి లక్ష ఉంటుందా అంటే అవుననే అనాల్సిందే. అదే హైదరాబాద్‌లోని బార్కాస్‌లో దొరికే అరబ్ లుంగీలు. రాజసం ఉట్టిపడేలా ఈ లుంగీలు సూటుబూటులకు ఏమాత్రం తీసిపోవు. ఇక్కడ అధికంగా పహీల్వాన్లు(కుస్తీవీరులు) ఉంటారు. అరబ్ లుంగీలు కడితే గాంభీర్యంతో పాలు ఆ గ్లామారే వేరంటున్నారు పాతబస్తీ బార్కాస్ వాసులు. పండగలు, పబ్బాల సీజాన్ కాకుండా ఏ సీజన్‌లో అయినా ఇక్కడ లుంగీల దుకాణాలు కిక్కిరిసి ఉంటాయి. యమన్, మలేషియా, ఇండోనేషియాలో తయారైన ప్రత్యేక లుంగీలు మరీ. వీటిని ఎక్కువగా అరబ్ దేశాల్లో కడుతారు.అక్కడి కల్చర్‌కు అలవాటు పడిన పాతబస్తీవాసులు వాటినే ట్రెండ్‌గా మార్చుకున్నారు.
నిజాం కాలం నుంచే..
నిజాం కాలంలో నగరానికి వలస వచ్చిన ఎంతో మంది అరబ్బులు ఇక్కడే స్థిరపడ్డారు. ఇక్కడి సంస్కతిని గౌరవిస్తూ తమ కల్చర్‌ను కాపాడుకుంటూ వస్తున్నారు. బార్కాస్‌లో అధిక సంఖ్యలో ఉండే పహీల్వాన్లు తమ సంస్కతిని ప్రతిభింబించే లుంగీనే ధరించేందుకు ఇష్టపడుతుంటారు. ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఆ లుంగీలపై చూపే ఆసక్తే వేరు. పండగల సమయాల్లో చాలా మంది సూటుబూటు ఫ్యాషన్ దుస్తులను కొనుగోలు చేస్తారు.
కానీ.. ఇక్కడ మాత్రం పండగలకు లుంగీలనే ఫ్యాషన్‌గా మారుస్తారు. 05–80 వయస్సున్న వారు లుంగీలే కడతారు. గత 200 సంవత్సరాల క్రితం తమ ముత్తాత, తాతల కాలం నుంచి లుంగీల వ్యాపారాలు ఉన్నాయని తాము కూడా లుంగీలే కడుతాం. రానున్న మా వంశం కూడా లుంగీలు కట్టేలా పోత్సాహిస్తామని ఇక్కడి వ్యాపారులు అంటున్నారు. ధరలో దర్పంలో సూటుబూటుకు దీటుగా దూసుకెళ్తున్న ఈ లుంగీలకు నేటి యువత జై కొడుతున్నారు.