టీఆర్ఎస్ ను ఆదుకోని ‘ పథకం ‘ ? రూట్ మార్చబోతున్న కేసీఆర్ ?

-

ఎప్పుడు లేని విధంగా ఇబ్బందికర పరిణామాలు తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ఎదుర్కొంటోంది. బలహీనంగా ఉంటూ వచ్చిన పార్టీలు కూడా ఇప్పుడు తమకు సవాలు విసిరే స్థాయికి బలం పెంచుకోవడం వెనుక తమ తప్పిదాలే ఉన్నాయనేది టిఆర్ఎస్ కాస్త ఆలస్యంగా గుర్తించింది. చాలా రోజులుగా పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిణామాలు పై సమీక్ష చేసుకుంటున్న కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వానికి జనాల్లో ఆదరణ తగ్గడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాన్ని విశ్లేషించుకుంటున్నారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నా, ప్రజల్లోకి పూర్తిగా వెళ్లడం లేదని, అలాగే ఆ పథకాలపై ప్రజల్లో సానుకూలత లేకపోవడం వంటి కారణాలతో టీఆర్ఎస్ పార్టీకి అనుకున్నంత స్థాయిలో సానుకూలత రావడం లేదు అనే విషయాన్ని కెసిఆర్ గుర్తించారు.

మొన్నటి వరకు టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందని, సంక్షేమ పథకాలే గట్టెక్కిస్థాయిని, ఏ ఎన్నికలు జరిగినా తెలంగాణలో తమదే విజయం అని భావిస్తూ కేసీఆర్ వచ్చారు. అందుకే ఆయన ఢిల్లీ రాజకీయాలపైన ఎక్కువగా దృష్టిపెట్టారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం టిఆర్ఎస్ అంత స్థాయిలో ప్రజల్లో సానుకూలతను పొందలేకపోయింది అనే విషయాన్ని టిఆర్ఎస్ పెద్దలు తీరిగ్గా  గుర్తించారు. దానికి నిదర్శనంగానే దుబ్బాక, గ్రేటర్ ఫలితాలు వెలువడ్డాయి అని అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన కల్యాణలక్ష్మి, రైతుబంధు,ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్లు, పెన్షన్లు ఇలా పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, తాము ఊహించిన స్థాయిలో జనాల్లో ఆదరణ లేకపోవడం టిఆర్ఎస్ కు ఆందోళన కలిగిస్తోంది. ఈ పథకాలను నమ్ముకుని ముందుకు వెళ్తే, రాబోయే రోజుల్లో ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో కెసిఆర్ ఉన్నారు. అందుకే ఇక నిత్యం ప్రజల్లోనే ప్రజా ప్రతినిధులు ఉండే విధంగా కెసిఆర్ ప్లాన్ చేస్తున్నారు.

ముఖ్యంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని అన్ని ప్రధాన సమస్యల పైన దృష్టి పెట్టాలని, ప్రజలలో ఏ ఏ విషయాలలో ప్రభుత్వంపై అసంతృప్తి ఉందో గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలుస్తోంది. రాబోయే నాగార్జునసాగర్ ఎన్నికలతో పాటు, సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని సీరియస్ గానే పార్టీ ఎమ్మెల్యేలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు టిఆర్ఎస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news