సినీ సెలబ్రిటీలే కాదు.. రాజకీయ నాయకులకు కూడా ఫ్యాన్స్ ఉంటారు. వారికి ఉండే అభిమానులు వారిని కలవాలని, వారితో ఫొటోలు దిగాలని చూస్తుంటారు. అయితే ఇది సహజమే అయినప్పటికీ.. ఆ మంత్రి మాత్రం తనతో ఎవరైనా సెల్ఫీ దిగితే ఒక సెల్పీకి రూ.100 వసూలు చేస్తున్నారు. అవును.. ఇది నిజమే. ఆ విషయాన్ని స్వయంగా ఆ మంత్రే వెల్లడించారు.
మధ్యప్రదేశ్ మంత్రి ఉషా ఠాకూర్ తనతో ఎవరైనా సెల్ఫీ దిగితే ఒక్కో సెల్ఫీకి రూ.100 వసూలు చేస్తున్నారు. ఆదివారం ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. తాను ఎక్కడ కార్యక్రమాలకు వెళ్లినా అభిమానులు సెల్ఫీలు దిగేందుకు వస్తున్నారని, దీంతో చాలా సమయం వృథా అవుతుందని, అయితే ఇలా రూ.100 పెట్టడం వల్ల కొందరు మాత్రమే సెల్ఫీలు దిగుతున్నారని తెలిపారు. దీంతో తాను ఇంకో కార్యక్రమానికి సులభంగా చేరుకుంటున్నానని అన్నారు.
అయితే అలా వసూలు చేసే రూ.100 ను తాను తీసుకోనని, తమది బీజేపీ కనుక.. పార్టీ కార్యక్రమాలకు ఆ మొత్తాన్ని అందిస్తానని తెలిపారు. ఇక తనను కలిసేందుకు వచ్చే వారు పువ్వులను కాకుండా పుస్తకాలను తీసుకురావాలని, దీంతో పేద విద్యార్థులకు వాటిని పంచవచ్చని సూచించారు. పువ్వులనే కేవలం దేవుళ్లు, దేవతలకు మాత్రమే సమర్పిస్తారని, కనుక తనకు పువ్వులను, పూల బొకేలను ఇవ్వొద్దని ఆమె అన్నారు. కాగా ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని అక్కడి బీజేపీ నేతలు స్వాగతిస్తున్నారు.