ఈ ఎన్నికల్లో సంక్షేమం, అభివృద్ధి అంశాలు పక్కకెళ్లాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ‘ఎన్నికలు రాజ్యాంగాన్ని మార్చాలా? మార్చకూడదా? అనే అంశాలపైనే జరుగుతున్నాయి. నేను మోదీ, అమిత్ షాల కంటే చిన్నవాడినే కావొచ్చు. కానీ పోలీసులతో నన్ను బెదిరించాలని చూస్తే.. అది మాత్రం జరగదు. కావాలంటే ఒకాయన ఈ రాష్ట్రంలోనే ఫ్రీగానే ఉన్నాడు. ఆయనను వెళ్లి అడగండి. నన్నే భయపెట్టే ప్రయత్నాన్ని విరమించుకోండి’ అని ఆయన సూచించారు.
ఇదిలా ఉంటే… రిజర్వేషన్లను రద్దు చేయాలనేదే RSS మూల సిద్ధాంతమని, దాన్ని అమలు చేయడమే బీజేపి అజెండా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు రాజ్యాంగంపై సమీక్షించాలని ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. అప్పటి రాష్ట్రపతి ప్రసంగ సారాంశంలో రిజర్వేషన్ల రద్దు గురించి ఉంది. ఆధారాలతో సహా నేను వాదిస్తున్నా. మూడింట రెండొంతుల మెజార్టీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్నారు’ అని రేవంత్ తెలిపారు.