తెలంగాణ శాసన మండలిలో మూడు సీట్లు ఖాళీ అవుతున్నాయి. త్వరలోనే ఆయా సీట్లకు కొత్తవారిని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే అధికార పార్టీ అధినేత, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ విస్తృతంగా చర్చ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్సీ రేసులో ఉన్నప్పటికీ.. వినయ విధేయతలు, పార్టీ కోసం చేసిన కృషి, అనుభవం వంటి వాటిని ప్రాతిపదికగా తీసుకుని కేసీఆర్ ఈ మూడు సీట్లను కేటాయించే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు. వీటిలో ఒకటి గవర్నర్ కోటాలో భర్తీ కానుండడం గమనార్హం.
నిజానికి తెలంగాణలో పదవుల కోసం చాలా మంది నేతలు వెయిట్ చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో పార్టీ గెలు పు కోసం కృషి చేసిన వారు ఎందరో ఉన్నారు. వీరంతా కూడా ఏదో ఒక పదవి దక్కకపోతుందా? అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మూడు ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేయనున్నారని వార్త వెలువడడంతో ఎవరికి వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. అయితే, కేసీఆర్ వ్యూహం మరో విధంగా ఉందని, ఇప్పటికే పేర్లు కూడా ఖరారు చేసుకున్నారని అంటున్నారు.
కేసీఆర్ దగ్గర ఉన్న జాబితా ప్రకారం ఈ మూడు ఎమ్మెల్సీలకు ముగ్గురు ఖరారైనట్టు సమచారం. వీరిలో నల్లగొండ జిల్లాకు చెందిన నాయకుడు కర్నె ప్రభాకర్‌రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయన కేసీఆర్‌కు అనుంగు అనుచరుడు కూడా కావడం గమనార్హం. అదేవిధంగా రెండో సీటును మాజీ అసెంబ్లీ స్పీకర్, కాంగ్రెస్ మాజీ నేత, ఎన్నికలకు ముందు టీఆర్ ఎస్‌లో చేరిన ఆర్. సురేష్ రెడ్డి పేరు వినిపిస్తోంది. అయితే, ఈయన రాజ్యసభ సీటును ఆశిస్తున్నారని తెలసింది.
కానీ, కేసీఆర్ రాజ్యసభ సీటుకు వేరే వారి పేర్లను పరిశీలిస్తుండడంతో సురేష్‌రెడ్డిని మండలికి పంపాలని ఇప్పటికే ఖరారు చేసుకున్నట్టు చెబుతున్నారు. ఇక, మూడో సీటు, గవర్నర్ కోటాలో దక్కే సీటున దేశపతి శ్రీనివాస్ కు ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఈయన మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. గతంలో ఉపాధ్యాయుడు అయిన శ్రీనివాస్ కేసీఆర్ పిలుపుతో ఉద్యోగాన్ని వదులుకు ని ఉద్యమంలో పాల్గొన్నారు. గాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు మొత్తానికి ఈ ముగ్గురికి కేసీఆర్ మండలి పదవులు ఇవ్వనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.