శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుగిరులు సర్వాంగ సందరంగా ముస్తాబయ్యాయి. ధ్వజారోహణంతో నేడు అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇవాళ సాయంత్రం 5 నుంచి 5.30 గంటల మధ్య ధ్వజ స్తంభంపై ధ్వజపటం ఎగురవేయడం ద్వారా ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. విష్ణు దర్బతో తయారు చేసిన 7 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు చాప, 211 అడుగుల పొడవు తాడును సిద్ధం చేశారు. రాత్రి తొమ్మిది గంటలకు పెద్దశేష వాహన కార్యక్రమంతో వాహన సేవలు ప్రారంభమవుతాయి.
ధ్వజారోహణంతో.. నేడు అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు అయిన ఈరోజు రాత్రి 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు. రామావతారంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం.