ఇవాళ ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. అయితే.. ఈ సమావేశానికి హాజరు కావాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులకు పిలుపు వచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించి కార్యాచరణ ప్రకటన చేయనున్నారు సీఎం కేసీఆర్. ఇక ఈ సమావేశం తర్వాత కేసీఆర్ తో సహా మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లనుంది. తెలంగాణ రాష్ట్రంలో 100 శాతం వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయనుంది బృందం.