టమాట మళ్లీ మంటెక్కింది. వంటింట్లో టమాట లేనిదే పూట గడవకున్నా ధరల షాక్‌తో ఈ కూరగాయను మగువలు పక్కనపెట్టేస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కిలో టమాటా ఏకంగా రూ. 100 దాటడంతో కొనేందుకు వినియోగదారులు వెనుకాడుతున్న పరిస్ధితి. హోల్‌సేల్ మార్కెట్లలో ధర పెరగడంతో రిటైల్ దుకాణాల్లో కిలో టమాట రూ. 80 నుంచి రూ. 120 వరకూ పలుకుతోంది.
అధిక ఉష్ణోగ్రతలతో పాటు రుతుపవనాల రాకలో జాప్యం కారణంగా దిగుబడులు తగ్గడంతో టమాట ధరలు మండుతున్నాయని రైతులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వర్షాల కారణంగా టమాటా పంటలు దెబ్బతిన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడి వల్ల దిగుబడి తగ్గింది. దీంతో టమాటాల సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. నష్టాల కారణంగా రైతులు టమాటా సాగు తగ్గించారు. హర్యాణా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి టమాటా సరఫరా బాగా తగ్గిపోయింది. దీని కారణంగా హోల్‌సేల్ మార్కెట్లలో టమాటా ధరలు రెట్టింపయ్యాయి. దీనికి తోడు టమాటాలు పండిస్తున్న రాష్ట్రాల నుంచి రవాణా ఖర్చులు కూడా పెరగడం వల్ల కూడా ధరలు పెరిగాయి.