పాకిస్థాన్ ఆర్మీ అదుపులోకి తీసుకున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ విక్రమ్ అభినందన్‌ను ఎట్టకేలకు విడుదల చేయనున్నారు. అభినందన్‌ను రేపు విడుదల చేస్తామని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు. ఇవాళ పాకిస్థాన్ పార్లమెంట్‌లో ఆయన ప్రకటన చేశారు. పాకిస్థాన్ పార్లమెంట్ ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కాగా… అందులో ఇమ్రాన్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ఇమ్రాన్‌ఖాన్ భారత పైలట్ అబినందన్‌ను విడుదల చేస్తామని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని అగ్ర దేశాల నుంచి ఒత్తిళ్ల రావడంతోనే పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుండగా.. అంతకు ముందు మాత్రం ఇమ్రాన్ అభినందన్ ను ఇప్పుడప్పుడే విడుదల చేయమని అన్నారు. భారత్, పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత తగ్గాలని, ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలని, భారత్‌లో శాంతి చర్చలు జరిపాకే అభినందన్‌ను విడుదల చేస్తామని మొదట ఇమ్రాన్ అన్నారు. కానీ అలా చేస్తే జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది. దీనికి తోడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నీ భారత్‌కే మద్దతు పలుకుతున్నాయి. దీంతో తమ మాట చెల్లదని భావించిన పాకిస్థాన్ వెనకడుగు వేసింది. అందులో భాగంగానే అభినందన్‌ను రేపు విడుదల చేస్తామని పాక్ వెల్లడించింది.
అయితే మరోవైపు ఇమ్రాన్ పాక్ పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ… భారత్‌తో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని, చర్చల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఇరు దేశాల మధ్య నెలకొని ఉన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకే తాము అభినందన్‌ను విడుదల చేస్తున్నామని, అంతేకానీ దీన్ని తమ బలహీనతగా భావించవద్దని ఇమ్రాన్ అన్నారు. శాంతిని కోరుకుంటున్నాం కాబట్టే అభినందన్‌ను విడుదల చేస్తున్నామని తెలిపారు.