ఆర్టిక‌ల్ 370 , కాశ్మీర్‌కి ఏం సంబంధం..? ఎందుకు ఉద్రిక్త‌త‌లు..?

-

ఆర్టిక‌ల్ 370. దేశ వ్యాప్తంగా ఇప్పుడు దీని మీదే చ‌ర్చ‌. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆర్టిక‌ల్ 370 ని ర‌ద్దు చేసేందుకు య‌త్నిస్తుంటే.. ప్ర‌తిప‌క్ష పార్టీలు మాత్రం అలా చేయ‌రాద‌ని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇంత‌కీ అస‌లు ఈ ఆర్టిక‌ల్ 370 అంటే ఏమిటి ? అది ఎలా ఉనికిలోకి వ‌చ్చింది ? దాని వ‌ల్ల ఏం జ‌రుగుతుంది ? వ‌ంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్టిక‌ల్ 370 అంటే..?

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 వ‌ల్ల జమ్మూ-కాశ్మీర్ ఒక‌ ప్రత్యేక రాష్ట్రంగా ప‌రిగ‌ణింప‌బ‌డుతుంది. అంటే దేశంలోని ఇత‌ర రాష్ట్రాల్లో ఒక ర‌క‌మైన నియ‌మ నిబంధ‌న‌లు ఉంటే.. ఆర్టిక‌ల్ 370 ప్ర‌కారం జ‌మ్మూ కాశ్మీర్‌లో మ‌రో ర‌క‌మైన నియ‌మ నిబంధ‌న‌లు ఉంటాయి. ఆర్టిక‌ల్ 370 1947లోనే ఉనికిలోకి వ‌చ్చింది. అప్ప‌ట్లో ప్ర‌ధానిగా ఉన్న జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ, కాశ్మీర్ నేత షేక్ మహమ్మద్ అబ్దుల్లాలు 5 నెల‌ల పాటు చ‌ర్చ‌లు జ‌రిపి కాశ్మీర్ దేశంలో ప్ర‌త్యేక రాష్ట్రంగా ఉండాల‌ని చెబుతూ ఆర్టిక‌ల్ 370ని ఏర్పాటు చేసి అమ‌లులోకి తెచ్చారు.

ఆర్టిక‌ల్ 370 తో ఏం జ‌రుగుతుంది ?

ఆర్టిక‌ల్ 370 వ‌ల్ల దేశంలో ఏ రాష్ట్రానికి లేన‌టువంటి స్వ‌యం ప్ర‌తిప‌త్తి జ‌మ్మూ కాశ్మీర్‌కు ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలో దేశంలోని ఇత‌ర రాష్ట్రాల్లో ఉండే పౌరులంద‌రికీ ఒక పౌర‌స‌త్వం ఉంటుంది. కానీ జ‌మ్మూ కాశ్మీర్ ప్ర‌జ‌ల‌కు మాత్రం ఆర్టిక‌ల్ 370 ద్వారా రెండు పౌర‌సత్వాలు ఉంటాయి. అది కాశ్మీరీ పౌర‌స‌త్వం, భార‌త పౌర‌స‌త్వం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 5 సంవ‌త్స‌రాల‌కు ఒక సారి ఎన్నిక‌లు జ‌రిగితే జ‌మ్మూ కాశ్మీర్‌లో మాత్రం 6 ఏళ్ల‌కు ఒక‌సారి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తారు. అలాగే సుప్రీం కోర్టు తీర్పులు, పార్ల‌మెంటు చ‌ట్టాలు ఈ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల‌కే ప‌రిమిత‌మ‌వుతాయి. ఇక జ‌మ్మూ కాశ్మీర్‌లో ఉండే కాశ్మీరీ యువ‌తి మ‌న దేశంలో ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన పౌరుడిని పెళ్లి చేసుకుంటే ఆమెకు కాశ్మీరీ పౌర‌స‌త్వం ర‌ద్ద‌వుతుంది. కానీ ఆమె పాకిస్థాన్‌కు చెందిన యువ‌కుడిని పెళ్లి చేసుకుంటే మాత్రం ఆమె కాశ్మీరీ పౌర‌స‌త్వం ర‌ద్దు కాదు. పైగా ఆమె భ‌ర్త‌కు కాశ్మీరీ పౌర‌స‌త్వం ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలోనే చాలా మంది పాక్ యువ‌కులు కాశ్మీరీ యువ‌తుల‌ను వివాహం చేసుకుని మొద‌ట కాశ్మీరీ పౌర‌స‌త్వాన్ని, త‌రువాత భార‌త పౌర‌సత్వాన్ని తీసుకునేందుకు య‌త్నిస్తున్నారు.

ఆర్టిక‌ల్ 370 వ‌ల్ల జ‌మ్మూ కాశ్మీర్ లో ఆర్‌టీఐ (స‌మాచార హ‌క్కు) చ‌ట్టాలు ప‌నిచేయ‌వు. కాగ్‌కు ఇక్క‌డ త‌నిఖీలు చేసే అధికారం లేదు. ఆర్టిక‌ల్ 370 వ‌ల్ల దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన వారు జమ్మూ కాశ్మీర్‌లో భూముల‌ను కొనుగొలు చేయ‌డం, అమ్మ‌డం కుద‌ర‌దు. అలాగే ఆర్థిక అత్య‌వ‌స‌ర స్థితిని దేశంలో ఇత‌ర రాష్ట్రాల్లో అమ‌లు చేయ‌వ‌చ్చు. కానీ జ‌మ్మూ కాశ్మీర్‌లో అది కుద‌ర‌దు. ఇక ఆ రాష్ట్రంలో హింస, అశాంతి చెల‌రేగినా రాష్ట్ర‌పతికి మాత్రం అత్య‌వ‌స‌ర స్థితి విధించే అవ‌కాశం లేదు. కేవ‌లం యుద్ధం వ‌చ్చిన‌ప్పుడు మాత్రమే అత్య‌వ‌స‌ర స్థితి విధించేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు బీజేపీ ఆర్టిక‌ల్ 370 ని ర‌ద్దు చేయాల‌ని ఆలోచిస్తోంది. కానీ ప్ర‌తిప‌క్ష పార్టీలు, జ‌మ్మూలో వేర్పాటు వాదులు మాత్రం ఇందుకు వ్య‌తిరేకంగా ఉన్నారు. మ‌రి ఆర్టిక‌ల్ 370 ర‌ద్ద‌వుతుందా, లేదా వేచి చూస్తే తెలుస్తుంది..!

ఆర్టికల్ 370 అంటే ఏంటి? దీనికి, కశ్మీర్ కు ఏంటి సంబంధం అనే విషయాలు తెలుసుకున్నారు కదా. ఆ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్రెండ్స్ కు, తెలిసిన వాళ్లకు షేర్ చేసి ఆర్టికల్ 370 గురించి వాళ్లకు తెలిసేలా చేయండి. 

Read more RELATED
Recommended to you

Latest news