మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకటి మంచి కొలెస్ట్రాల్. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. మరొకటి బ్యాడ్ కొలెస్ట్రాల్. దీన్ని ఎల్‌డీఎల్ అని పిలుస్తారు. అయితే మన శరీరానికి హెచ్‌డీఎల్ మంచిది కానీ.. ఎల్‌డీఎల్ కాదు. అందువల్ల ఎల్‌డీఎల్ తయారు కాకుండా చూసుకోవాలి. ఇందుకు గాను నిత్యం వ్యాయామం చేయడంతోపాటు.. కింద సూచించిన పలు ఆహార పదార్థాలను తీసుకోవాలి. దీంతో శరీరంలో ఎల్‌డీఎల్ పేరుకుపోకుండా ఉంటుంది. ఫలితంగా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. మరి ఆ ఆహారాలు ఏమిటంటే…
* విటమిన్ బి3.. దీన్నే నియాసిన్ అని కూడా అంటారు. ఇది మన శరీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. హెచ్‌డీఎల్‌ను పెంచుతుంది. విటమిన్ బి3 మనకు దానిమ్మ పండ్లు, పెసలు, సోయా, చేపలు, చికెన్, నట్స్, అరటిపండ్లు, పాలకూర, టమాటాలలో లభిస్తుంది. కనుక ఈ ఆహారాలను తరచూ తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) పేరుకుపోకుండా ఉంటుంది.
* ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉండే ఆహారాలైన ఓట్స్, బార్లీ, ఆపిల్స్, బెర్రీలు, తాజా ఆకుకూరలు, క్యారెట్లు, మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు.
* ఆలివ్ ఆయిల్, అవకాడో, వెల్లుల్లి తదితర ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు.
* గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి. కనుక గ్రీన్ టీని తరచూ తాగుతుండాలి.
* కాలిఫ్లవర్, శనగలు, పచ్చి బఠానీలు, చిలగడ దుంపలు, బెండకాయలు తదితర కూరగాయలను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ చేరదు.