నేడు ప్రధాని మోడీ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈ మేరకు గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) 20వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని అధికారులు వెల్లడించారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి విప్రో జంక్షన్ వరకు ఉన్న ఐటీ, ఇతర కంపెనీలు తమ ఆఫీస్ టైమింగ్స్‌ను మార్చుకోవాలని సూచించారు. ఈ రూట్లలో వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.
గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్ వద్ద మలుపుతీసుకుని బొటానికల్ గార్డెన్, కొండాపూర్ ఏరియా దవాఖాన, మజీద్ బండ కమాన్, హెచ్‌సీయూ డిపో రోడ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. విప్రో జంక్షన్ నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలు.. క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్‌పల్లి క్రాస్‌రోడ్, హెచ్‌సీయూ బ్యాక్ గేట్, నల్లగండ్ల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లేవారు ఫెయిర్ ఫీల్డ్ హోటల్, నానక్‌రాంగూడ రోటరీ, ఓఆర్ఆర్ రోడ్, ఎల్ అండ్ టీ టవర్స్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
కేబుల్ బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి జంక్షన్ వైపు వెళ్లే వాహనాలు.. జూబ్లీహిల్స్ రోడ్డు నం.45, మాదాపూర్ పీఎస్, సైబర్ టవర్స్, హైటెక్స్, కొత్తగూడ, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి జంక్షన్ మీదుగా దారిమల్లిస్తున్నట్లు చెప్పారు. ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో సిటీలోకి భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధం విధిస్తున్నామని చెప్పారు. ప్రధాని భద్రత దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐఎస్‌బీకీ 5 కిలోమీటర్ల పరిధిలో రిమోట్ కంట్రోల్ డ్రోన్ల వాడకంపై, ప్యారాగ్లైడింగ్, మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్‌పై నిషేధం విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు.