నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆలయ రథాన్ని తరలించే క్రమంలో అపశ్రుతి నెలకొంది. రథానికి విద్యుత్ తీగలు తగలడంతో.. రథాన్ని లాగుతున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ మేరకు అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లి మండలం కేతేపల్లిలోని ఆలయంలో రథాన్ని భద్రపరుస్తున్నారు. రథాన్ని లాగుతున్న క్రమంలో విద్యుత్ తీగలకు రథ గోపురం తగిలింది. దీంతో విద్యుత్ షాక్ తగిలి.. రథం లాగుతున్న వ్యక్తుల్లో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారు.. కేతేపల్లి గ్రామానికి చెందిన రాజాబోయిన యాదయ్య (42), పొగాకు మొనయ్య (43), మక్కలపల్లికి చెందిన కారు డ్రైవర్ దాసరి అంజి (20)గా గుర్తించామన్నారు. క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి, మృతదేహాలను మార్చరీకి తరలించామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.