బెదిరించడమే కాకుండా రిట్ ఎలా వేస్తారు అని ప్రశ్నిస్తోంది హై కోర్టు. అంతేకాదు జీతం పై కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఉద్యోగులకు సమ్మెకు పోకపోవడమే మేలు.ఉన్న ఆ కాస్త పరువైనా దక్కుతుంది అన్న వాదన ఒకటి వినిపిస్తుంది.హెచ్ఆర్ఏ స్లాబుల తగ్గింపు అన్నది విభజన చట్టంకు వ్యతిరేకంగా ఉంది అని ఉద్యోగులు చేస్తున్న వాదనకు కూడా బలం లేదని హై కోర్టు అంటోంది. ఇవాళ గెజిటెడ్ ఆఫీసర్స్ వేసిన రిట్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. ఈసందర్భంలో ఉద్యోగులకు సానుకూలంగా ఒక్కటంటే ఒక్క మాట కూడా కోర్టు వెలువరించకపోవడం గమనించదగ్గ విషయం.
ఉద్యోగులకు సంబంధించి ఒక చేదు వార్త. జీతాలు తగ్గించే అధికారం ప్రభుత్వానికి ఉంది అంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడీ వర్గాలను పునరాలోచనకు గురిచేస్తున్నాయి. దీంతో ఉద్యమం ఏ విధంగా నడిపితే బాగుంటుంది అన్న ఆలోచనలో ముఖ్య ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పడ్డాయి. మరోవైపు వైసీపీ వర్గాలు ఈ వార్త విని పండగ చేసుకుంటున్నాయి. తాము చెప్పిన విధంగా కాస్త ఆగి ఉద్యోగ వర్గాలు ఉంటే అందరికీ మంచే జరుగుతుందని మంత్రులు సైతం హితవు చెబుతున్నారు.
మరోవైపు మంత్రుల కమిటీ ఇవాళ సమావేశమైంది. జీతం సర్దుబాట్లపై పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణా రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి (ప్రభుత్వ సలహాదారులు) సమావేశమై చర్చిస్తున్నారు. అన్ని వర్గాలకూ న్యాయం చేయాలన్న ఆలోచనతోనే తమ సీఎం ఉన్నారని ఎప్పటి నుంచో బొత్స చెబుతూ వస్తున్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం.
ఆంధ్రావనిలో పీఆర్సీ రగడ నెలకొని ఉంది. దీనిపై ఇవాళ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హై కోర్టు స్పష్టమైన వైఖరి వెల్లడించింది. జీతాల తగ్గింపుపై మాట్లాడేందుకు లేదని, అది ప్రభుత్వ నిర్ణయం అని హైకోర్టు తేల్చి చెప్పింది. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు తగ్గాయని ఎలాచెప్పగలరని పిటిషనర్లను ప్రశ్నించింది.
దీంతో సంబంధిత వర్గాలు డైలామాలో పడ్డాయి. మధ్యాహ్నం మూడు గంటలకు సమ్మె నోటీసు ఇస్తామని ఉద్యోగ సంఘాలు భావించినప్పటికీ హైకోర్టు నుంచి వచ్చిన పిలుపు మేరకు వీళ్లంతా అక్కడికి హాజరు కావాల్సి ఉంది. కోర్టు కూడా సమ్మెను సమర్థించకపోవడంతో ఉద్యోగ సంఘాలు డైలమాలో పడ్డాయి.