పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహా ఇది అని కొందరు అన్నారు. కేసీఆర్ తో సహా చాలా మందికి ఆయన ఇలానే సలహాలు ఇస్తారు. అవన్నీ పాటింపులో ఉంటాయా? అలా ఉంటే ఇంకేం ఎన్నో మంచి పనులు ఇవాళ వెలుగులోకి రావాలి? ఏదయితేనేం సర్కారు పెద్దలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఎందరో నిరుద్యోగులకు ఆశా కిరణంలా మారి ఇవాళ కేసీఆర్ ప్రకటన ఉండడం అన్నది నిజంగానే, నిజంగానే వేచి ఉన్న ఉదయాలకు అర్థం దొరికిందనే భావించాలి.
అందుకే సెబ్బాస్ రా కేసీఆరా అని అంటున్నారు ఇటు ఆంధ్ర అటు తెలంగాణ ప్రజలు. బిడ్డల ఉన్నతిని కోరి చేసే ఏ పని అయినా మేం అంతా అభినందిస్తాం అంటూ కేసీఆర్ కు శ్రీకాకుళం వాసులు జేజేలు పలుకుతున్నారు. శ్రీకాకుళం మొదలుకుని నెల్లూరు దాకా ఇదే విధంగా కేసీఆర్ ఆలోచన బాగుందని త్వరిగతిని కాల హరణం చేయకుండా నోటిఫికేషన్ ఇవ్వడం ఎందరో జీవితాలకు ఓ భరోసా దక్కిందని అంటున్నారు ఆంధ్రా ప్రజలు. మొన్నటి వేళ కూడా అసెంబ్లీలో ఉద్యోగాలకు సంబంధించి చేసిన ప్రకటన నేపథ్యంలో ఆంధ్రాకు చెందిన చాలా ప్రాంతాల్లో కేసీఆర్ కు పాలాభిషేకాలు చేసిన వైనం మరువలేం.
ఈ దశలో ఎన్నికలు సమీపిస్తున్న సమయాన నిరుద్యోగ యువత కు శుభవార్త చెప్పారు కేసీఆర్. ఒకవేళ ఇది ఒక ఎన్నికల స్టంట్ అనుకున్నా కూడా కేసీఆర్ నిర్ణయంపై ఆంధ్రాలో కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముందుగా ప్రకటించిన విధంగానే కేసీఆర్ నోటిఫికేషన్ ఇవ్వడం, తదనుగుణ చర్యలు కూడా ప్రారంభం కావడంతో ఆయనంటే చాలా మంది ప్రేమ కనబరుస్తున్నారు.
ముఖ్యంగా పదకొండు వేలకు పైగా పోస్టులను రెగ్యులరైజ్ చేస్తామని కాంట్రాక్టు ఉద్యోగుల విషయమై చెప్పి వారి జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ నిజంగానే ఆదర్శనీయుడు అని ఆంధ్రా ప్రజలు కొనియాడుతున్నారు. ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్న వారికి కేసీఆర్ ప్రకటన తరువాత పరిణామాలు అన్నీ కూడా రేపటి వేళ కొత్త ఉత్సాహానికి కారణాలు అవుతాయి అని అంటున్నారు. ఊరు వదిలి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ తిండీ తిప్పలు లేక క్లాసులకు హాజరవుతున్న యువతకు పెద్దన్నయ్య గా భుజం తట్టారు అని కూడా అంటున్నారు ఇంకొందరు. ఇక ఆలస్యం ఏముంది వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడమే యువత ప్రథమ కర్తవ్యం కావాలని టీఆర్ఎస్ నాయకులు,మంత్రి హరీశ్ రావు పిలుపునిస్తున్నారు.
ఉద్యోగాలు లేక ఎందరో యువత నోటిఫికేషన్ల కోసం ఏళ్ల తరబడి భాగ్య నగరి దారుల్లో తిరుగాడుతున్నారు. వివిధ లైబ్రరీల దగ్గర చెట్ల నీడల్లో చదువుకుంటూ, తల్లిదండ్రులకు భారం కాకుండా పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ ఎందరికో ఆదర్శం అవుతున్నారు. బాధ్యత గల యువకులకు తెలంగాణ సర్కారు అండగా నిలిచి ఇచ్చిన మాట ప్రకారమే 30వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు నిన్నటి వేళ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఈ నోటిఫికేషన్ లో పోలీసు శాఖలోనే ఎక్కువగా ఖాళీలు ఉన్నాయి. మొన్నటి వేళ ఎనభై వేలకు పైగా పోస్టులకు సంబంధించి తమ ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలో తొలి అడుగు వేసి నిరుద్యోగుల కంటనీరు తుడిచారు. మాటలు కాదు నావి చేతలు అని నిరూపించారు. ఆ రోజు ఆయన ప్రకటన చేయగానే విపక్షాలు ఏవేవో మాట్లాడాయి. కానీ కేసీఆర్ అవేవీ పట్టించుకోకుండా తన కార్యదక్షతకు, దార్శినికతకు ఎదురేలేదని నిరూపించారు.
తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్లో పోలీసు శాఖ తరువాత వైద్య ఆరోగ్య శాఖలో పదివేలకు పైగా పోస్టులు ఉన్నాయి. తాజాగా వచ్చిన నోటిఫికేషన్ ద్వారా 30 వేల పోస్టుల భర్తీకి సంబంధించి ఓ స్పష్టత వచ్చింది. మిగతా ఖాళీలు త్వరలోనే భర్తీ చేయనున్నారు.