కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఉద్యోగుల విభజన అన్నది కత్తి మీద సాములానే ఉంది. సర్వీసు విషయాలపై ఇంకా కొంత అస్పష్టత ఉంది. అదేవిధంగా కార్యాలయాల ఏర్పాటుపై కూడా సందిగ్ధతే ఉంది. జిల్లాకు రెండు కోట్లు కేటాయించినా కూడా నిధులు సరిపోయేలా లేవు. చాలా చోట్ల కలెక్టరేట్ తో సహా ముఖ్య కార్యాలయాల ఏర్పాటుకు వసతి సౌకర్యం కల్పన అన్నదే సమస్య కానుంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం పట్టుదలతోనే ఉన్నారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల ఆరంభం కానుందని తేల్చేశారు. కానీ అభ్యంతరాలను మాత్రం ఆయన పట్టించుకోవడం లేదు. వాటిపై ఏ తరహా పరిష్కారం ఇస్తారన్నది కూడా తేల్చడం లేదు. ఈ నేపథ్యంలో అనంతపురం కేంద్రంగా రేగుతున్న వివాదం ఒకటి మళ్లీ తెరపైకి వచ్చింది.
వాస్తవానికి హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తూ సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేయాలని సినీనటుడు,ఆ ప్రాంత ఎమ్మెల్యే బాలకృష్ణ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే ! అవసరం అయితే తన పదవికి రాజీనామా కూడా చేస్తానని అన్నారు. పుట్టపర్తి ని జిల్లా కేంద్రంగా చేస్తూ సత్య సాయి జిల్లాను ప్రకటించడం సమంజసం గా లేదని ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్నారు. హిందూపురం అన్ని విధాల ఆమోదయోగ్యం అయిన జిల్లా కేంద్రం అని బాలయ్య తేల్చి చెబుతున్నారు.దీనిపై సీఎంను కూడా కలుస్తానని అంటున్నారు. కానీ ఇప్పటి దాకా ఆ దిశగా అడుగులేవీ పడడం లేదు.
బాలయ్య తన కొత్త సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. వాస్తవానికి పుట్టపర్తి కేంద్రంగా జిల్లా ఏర్పాటుపై టీడీపీ అనే కాదు వైసీపీ కూడా ఆందోళన చెందుతూనే ఉంది. కానీ అధినాయకత్వానికి ఎదురువెళ్లేంత ధైర్యం స్థానిక నాయకత్వానికి లేదు. ముందు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటయ్యే శ్రీ సత్య సాయి జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండనున్నాయి. మడకశిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం ఉన్నాయి.
అదేవిధంగా మూడు రెవెన్యూ డివిజన్లు కూడా ఈ జిల్లా పరిధిలో ఉండనున్నాయి. ధర్మవరం, పెనుకొండ రెవెన్యూ డివిజన్లతో పాటు కొత్తగా పుట్టపర్తిని కూడా రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఉంది. కానీ బాలయ్య తో సహా కొందరు నాయకులు కొన్ని అభ్యంతరాలు చెప్పారు.ఇవే అభ్యంతరాలను హై కోర్టుకు కూడా విన్నవించారు ఇంకొందరు. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని శ్రీ సత్యసాయి జిల్లాగా, హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ హిందూపురం అఖిలపక్ష కమిటీ పిల్ దాఖలు చేసింది. నాడు పాదయాత్రలో భాగంగా జగన్ ఇచ్చిన మాట ప్రకారం హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ న్యాయ పోరాటానికి తాము సిద్ధమేనని తేల్చి చెప్పారు. ఇక ఇప్పటికైనా బాలయ్య కానీ టీడీపీ నేతలు కానీ పోరు తీవ్ర తరం చేస్తారా ?
– ట్రెండ్ ఇన్ – మన లోకం ప్రత్యేకం