తెలంగాణలో కీలకమైన ఆ పదవుల్లో కొత్తవాళ్లకు అవకాశం ఇస్తారా ?

-

తెలంగాణలో కార్పోరేషన్ పదవులు పంపకం పై ఆశగా ఎదురుచూస్తున్నాయి గులాబీ పార్టీ శ్రేణులు. రెండో సారి అధికారంలొకివచ్చి రెండేళ్లు దాటుతున్నా అదిగో ఇదిగో అంటూ ఊరడింపు తప్పా పదవులను భర్తి చేసింది లేదు. వీటిలో కీలకమైన ఆ మూడు పదవులు ఎవరిని వరిస్తాయి అన్నది ఆసక్తి రేపుతుంది. కొత్త వారిని నియమిస్తారా పాత వారికే మరో చాన్స్ ఇస్తారా అన్న టెన్షన్ లో ఆశావహుల లాబీయింగ్‌ మాత్రం జోరందుకుంది.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, బీసీ కమిషన్‌ల పదవీకాలం ముగింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ పదవీ కాలం కూడా దగ్గరపడుతోంది. ఈ మూడూ రాజ్యంగ బద్ధమైన కార్పోరేషన్ పదవులు. వీటిపై కన్నేసిన కొందరు ప్రగతి భవన్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమకు పరిచయం ఉన్న వారిసాయంతో ప్రభుత్వ పెద్దల చెవిలో తమ పేరు చెబుతున్నారట. అయినా ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదు. కొత్తగా ఎవరిని నియమిస్తారన్న లీకులు కూడా బయటకు రావడం లేదు.

తెలంగాణ ఏర్పాటైన తర్వాత టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణిని, సభ్యులుగా విఠల్‌, చంద్రావతితోపాటు మరికొందరిని నియమించారు. గత ఏడాది డిసెంబర్‌తో వీరందరి పదవీకాలం ముగిసింది. ఇప్పుడు టీఎస్‌పీఎస్సీ పూర్తిస్థాయి చైర్మన్‌ లేదు. కొత్త చైర్మన్‌ గా కెప్టెన్ లక్ష్మీకాంతరావు తనయుడు, సభ్యులుగా కొందరి పేర్లు అధికారపార్టీలో చర్చకు వచ్చినా..ఎవరిని ఎంపిక చేయాలన్నది డైలమాలో పడినట్టు సమాచారం. ఇప్పటి ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో తేల్చుతారా నాన్చుతారా అన్న చర్చ జరుగుతోంది.

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా రాజకీయ పరమైన నియామకం చేపట్టాలా లేక ఎవరైనా రిటైర్డ్‌ అధికారిని నియమించాలా అన్నది తేలడం లేదట. పూర్తి స్థాయి చైర్మన్‌, సభ్యులు లేకపోవడంతో కమిషన్‌లో ఏదైనా నోటిఫికేషన్‌ ఇవ్వాలంటే ముందుకెళ్లలేని పరిస్థితి ఉందట. చైర్మన్‌ పదవికి ఉన్న పరిమితులు.. వచ్చే విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు కొందరు చెబుతున్నారు. వయసు పరిమితి దృశ్య రిటైర్‌ అయిన ఐఏఎస్‌ లేదా ఐపీఎస్‌లను ఎక్కువ రోజులు ఆ పదవిలో . అలాగని రాజకీయ నియామకం చేపడితే.. రేపటి రోజున ఏదైనా తేడా వస్తే ప్రభుత్వం ఇరుకున పడే ప్రమాదం ఉంది.

ఇక తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌గా బీఎస్ రాములు పనిచేశారు. ఏడాదిగా ఈ పదవి ఖాళీగా ఉంది. రాములతోపాటు మరో ముగ్గురు సభ్యులను రీ అపాయింట్‌ చేస్తారని ఒక టాక్‌ ఉంది. అయితే రాములు మాత్రం ఎమ్మెల్సీ ఆశిస్తున్నట్టు సమాచారం. మరో రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ పదవి ఈ నెలలోనే ముగిసిపోనుంది. ఈ కమిషన్‌ చైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఉన్నారు. ఆయన సుదీర్ఘకాలంగా టీఆర్‌ఎస్‌తో అనుబంధం ఉంది. ఎమ్మెల్యే టికెట్‌ ఆశించిన ఎర్రోళ్లను ఎస్సీ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ను చేశారు సీఎం కేసీఆర్‌. మరి శ్రీనివాస్‌ను రీఅపాయింట్‌ చేస్తారా లేక మరేదైనా పదవి ఇస్తారా అన్నది అంతుచిక్కడం లేదు. మరి కీలకమైన ఈ రాజ్యాంగ పదవులు ఎవరిని వరిస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news