ఎమ్మెల్యే పై తిరుగుబాటు మొదలెట్టిన సొంత పార్టీ కేడర్

-

అధికార పార్టీ ఎమ్మెల్యే పై సొంత పార్టీ కేడర్‌ గుర్రుగా ఉందట. ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారట. ఏళ్ల తరబడి వైసీపీని నమ్ముకుని ఉన్నవాళ్లను పక్కనపెట్టి వైరిపక్షాల నుంచి వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తున్నారని సొంత కేడరే ఫైరవుతుంది. ఈ వివాదం వైసీపీ అధిష్టానం వద్దకు చేరడంతో ప్రకాశం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

అన్నా రాంబాబు ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే. 2009లో రాజకీయాల్లోకి వచ్చి పీఆర్పీ ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేయడంతో ఆయనా అందులోకి వెళ్లారు. కానీ 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను వీడి టీడీపీ కండువా కప్పుకొన్నారు రాంబాబు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసినా ఓడిపోయారు. 2019 ఎన్నికల నాటికి మరోసారి పార్టీ జంప్‌ చేశారు. టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరిపోయారు. ఈసారి భారీ మెజారిటీతో గెలిచి వైసీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.

రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడానికి భారీ మెజారిటీ రావడానికి టీడీపీలో ఉన్న తన మద్దతుదారులు, పీఆర్పీలో తనతో కలిసి పనిచేసిన శ్రేణులేనని అన్నా రాంబాబు ఫీలవుతారట. అందుకు తగ్గట్టుగానే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారట ఎమ్మెల్యే. ఈ విషయంపైనే వైసీపీ కేడర్‌కు, ఎమ్మెల్యేకు మధ్య గ్యాప్‌ వచ్చినట్టు సమాచారం. చివరకు రెడ్డి సామాజికవర్గం వారిని కూడా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారట. రాంబాబుకు వ్యతిరేకంగా వైసీపీ పెద్దలకు కార్యకర్తలు ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తుంది.

గిద్దలూరు మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయడానికి చైర్మన్‌ కావడానికి వైసీపీలో చాలా మంది ఆశ పెట్టుకుంటే.. తనతోపాటు వైసీపీలోకి వచ్చిన రామకృష్ణారావు అనే నేత పేరును తెరపైకి తెచ్చారట రాంబాబు. గతంలో రామకృష్ణారావు కంభం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. అప్పట్లో ఆయన్ని ఓసీ నేతగా ప్రచారం చేశారట. అలాంటి రామకృష్ణారావును ఇప్పుడు బీసీ నేతగా ప్రచారం చేస్తూ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా ఎలా ప్రొజెక్ట్‌ చేస్తారని కేడర్‌ ప్రశ్నిస్తోంది. ఈ సందర్భంగా ఏదో జరుగుతోందని అనుమానిస్తూ కొంతమంది మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారట. పనిలో పనిగా ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశారట.

నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను సైతం సొంత పార్టీలోని వారికి కాకుండా తనతోపాటు వైసీపీలోకి వచ్చిన వారికే ఎమ్మెల్యే రాంబాబు కట్టబెడుతున్నారని గుర్రుగా ఉన్నాయి పార్టీ శ్రేణులు. సైలెంట్‌గా ఉంటే లాభం లేదని భావించి ఫిర్యాదులపై ఫిర్యాదులు పెడుతున్నారట. దీంతో నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ మధ్య పోరు కాకుండా.. ఎమ్మెల్యే రాంబాబు, వైసీపీ కేడర్‌ మధ్య ఫైట్‌గా రాజకీయాలు మారిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news