క్రెడిట్ కోసం ఆ రెండు పార్టీలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుస్తీ పడుతున్నాయి. అది రోడ్డు అయినా.. రైతు వేదికైనా ఏ మాత్రం రాజీ పడటం లేదు ఏడాదిన్నరగా ఇదే వైఖరితో క్షేత్రస్థాయిలోనూ రాజకీయవేడి రగిలిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్, బీజేపీలకు అస్సలు పడటం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ ఎంపీగా సోయం బాపూరావ్ గెలిచిన తర్వాత రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరాటం ఓ రేంజ్‌లో సాగుతోంది. విమర్శలు, మాటల తూటాలు లేకుండా నేతలకు రోజు గడవని పరిస్థితి ఉంది. సోషల్ మీడియాను సైతం ఇష్టారీతిన వాడేసుకుంటున్నారు నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా.. ఇందులో కేంద్రం వాటా కూడా ఉందని వాదిస్తున్నారు బీజేపీ నేతలు. ఈ విమర్శలకు టీఆర్‌ఎస్ నేతల కౌంటర్లు మామూలైపోయాయి.
ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా వేదికలపై సీఎంతోపాటు ప్రధాని ఫొటోలు కూడా ఉండాలన్నది బీజేపీ డిమాండ్. టీఆర్‌ఎస్ నేతలు ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదు. ఆ మధ్య జాతీయ రహదారి 44కు నిధులు తీసుకురావడంలో తమదే ఘనత అని టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ నగేష్ ప్రకటించారు. ఆ ఘనత మీదా అని ప్రశ్నిస్తూ బీజేపీ ఎంపీ బాపూరావ్ పార్టీ శ్రేణులతో కలిసి నిధుల వివరాలు వెల్లడించారు. ఇదిగో భూమి పూజ చేశామని టెంకాయ కొట్టేశారు. ఈ రగడ ఇంకా చల్లారలేదు.
ఈ మొత్తం ఎపిసోడ్‌లో ప్రత్యర్ధి పార్టీ ఖాతాలో క్రెడిట్ పడకూడదనే తాపత్రయం కనిపిస్తోంది. అందుకే టీఆర్‌ఎస్, బీజేపీలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమ శక్తి మేర సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా టీమ్‌లు ఏర్పాటు చేసుకుని ఎవరేం చెబితే.. దానికి కౌంటర్లు వేస్తున్నారు. వీరి హడావిడి చూస్తుంటే.. రేపో మాపో ఎన్నికలొస్తున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. ఎటు చూసినా మూడు నాలుగేళ్ల వరకూ ఎన్నికలు లేవు. అయినా ప్రచారంలో వెనకపడితే ఎప్పుడేం జరుగుతుందనే ఆందోళనతో మాటలతో మంటలు పుట్టిస్తున్నారు నాయకులు.