శాసనసభ సమావేశాల నిర్వహణ సహా ఇతర అంశాలపై చర్చించేందుకు నేడు తెరాస కేబినెట్ కానుంది. మధ్యాహ్నం ప్రగతి భవన్ వేదికగా జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు, మంత్రి మహమూద్ అలీ, ఉన్నతాధికారులు పాల్గొంటారు. శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి కొత్త ప్రభుత్వం ఎన్నికయ్యాక జరుగుతున్న మొదటి మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై అధికారికంగా నిర్ణయం తీసుకుంటారు.
ఈ నెల 19న ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, ఇతర అంశాలకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించనున్నారు.