బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. కాషాయం కండువా కప్పుకున్న టీఆర్ఎస్ నేతలు

ఆదిలాబాద్: జిల్లాలో బీజేపీ అపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీ నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తోంది. దీంతో పలువురు నేతలు బీజేపీ జెండా కప్పుకుంటున్నారు. స్థానిక బీజేపీ నేతలు ప్రధానంగా టీఆర్ఎస్ నేతలు, కార్తకర్తలపైనే దృష్టి పెట్టారు.. ఎంతమందిని పార్టీలోకి తీసుకుంటే అంత బలం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో ఎంపీ సోయంబాపూరావు బీజేపీలో ఉన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా వలసలను ప్రోత్సహిస్తోంది.

తాజాగా టీఆర్ఎస్‌కు ఇద్దరు కీలక నేతలను బీజేపీలోకి తీసుకున్నారు. గుడిహత్నూర్‌ మండలానికి చెందిన మచ్చాపూర్‌ ఎంపీటీసీ జాదవ్‌ వచ్చలబాయి, భర్త జాదవ్‌ కాంతారావుతోపాటు ముత్నూర్‌ సర్పంచ్‌ గేడం విజయ్‌కుమార్‌లు బీజేపీ‌లో చేరారు. వీరిద్దరు కూడా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ నివాసంలో బీజేపీ కండువా వేసుకున్నారు. ఈ సందర్భంగా పాయల శంకర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసే పలువురు బీజేపీలో చేరుతున్నారన్నారు.