30 ఎకరాలు కొన్న ఆ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకి నిద్ర కరువైందా…?

అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే పరిస్థితి కక్కలేక.. మింగలేక అనేలా తయారైంది.అప్పట్లో ముందుచూపుతో చేసిన పనే ఇప్పుడు చిక్కుల్లో పడేసింది. ఆయన గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే. అనేక రకాల బిజినెస్‌లు చేస్తూ బాగా వెనకేసున్నారని అధికార పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటాయి. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కావడంతో సిటీలో ఏదైనా స్థలం.. భవనం కొన్నా తెలుసిపోతుందని భావించారో ఏమో సిటీకి ఆనుకుని ఉండే రంగారెడ్డి జిల్లాలో 30 ఎకరాల పంట పొలాలను కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేశారు.

ఆ పొలాన్ని కూడా తనపేరున కాకుండా బినామీల పేరుతో కొనుగోలు చేసినట్టు చెబుతారు. సమయం చిక్కితే ఆ పొలాలకు వెళ్లి చూసుకోవడం హాబీగా మార్చుకున్నారు ఎమ్మెల్యే. రాష్ట్ర రాజధానికీ కొద్ది దూరంలోనే పొలం ఉండటంతో ఆ వ్యవసాయ భూమికి మంచి డిమాండ్ వచ్చింది. అయినప్పటికీ ఆ పొలాన్ని అమ్మే ఆలోచనలో లేరు సదరు ఎమ్మెల్యే. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఆ వ్యవసాయ భూమికి కొత్త చిక్కులు రావడంతో మింగలేక.. కక్కలేక ఉన్నారట అధికార పార్టీ ఎమ్మెల్యే.

రంగారెడ్డి జిల్లాలోని కాగ్నా నది నుంచి ఏటా 4TMCల నీళ్లు కర్నాటకకు వెళ్తాయి. దాంతో ధారూర్‌ మండలంలోని నాగారం-అంతారం గ్రామాల మధ్యలో ఒక రిజర్వాయ్‌ కట్టి సమీపంలో ఉన్న నాగారం, మైలారం, అంతారం, మొమిన్‌కుర్దు గ్రామాలకు తాగు, సాగునీరు ఇస్తామని అప్పట్లో టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చింది. ఇప్పుడా హామీ నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టు చేపట్టాలంటే ధారూర్‌ మండలంలోని దాదాపు 380 ఎకరాల భూమి సేకరించాలని లెక్కలు వేశారు. అయితే ఈ 380 ఎకరాల పరిధిలో సిటీ ఎమ్మెల్యేకు చెందిన 30 ఎకరాలు కూడా ఉన్నాయట. ఈ విషయం తెలిసినప్పటి నుంచీ ఆ అధికార పార్టీ ఎమ్మెల్యేకు నిద్ర కరువైందట. మొత్తానికి ఈ అంశం ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.