గ్రేటర్ ఫలితాల పై ప్లాన్‌ బీ సిద్ధం చేసిన అధికార పార్టీ

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిచిన సీట్లతోపాటు ఎక్స్‌అషీషియో ఓట్లు కూడా మేయర్ ఎన్నికకు కీలకం కానున్నాయి. ఎక్స్‌అఫీషియా ఓట్లు అవసరం లేకపోతే.. ఒక్కో పార్టీ ఓక్కో విధంగా డివిజన్లు గెలవాల్సి ఉంటుంది. ఈ విషయంలో అధికారపార్టీ టీఆర్‌ఎస్‌కు కొంత వెసులుబాటు ఉందనే చెప్పాలి. ఒక వేళ తాము అనుకున్న విధంగా సీట్లు గెలవకపోతే అన్నదాని పై కూడా ప్లాన్ బీ రెడీ చేస్తుంది గులాబీ దళం…

 

గ్రేటర్‌ హైదరాబాద్‌లో 150 డివిజన్లు ఉన్నాయి. సొంతంగా మేయర్‌ పీఠం దక్కించుకోవాలంటే 76 డివిజన్లు గెలుపొందాలి. అయితే ఇక్కడో తిరకాసు ఉంది. ఎక్స్‌అఫీషియో ఓట్లు కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఈ దఫా గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 41 డివిజన్లలో గెలిచినా.. పరోక్ష పద్ధతిలో ఎన్నుకునే మేయర్‌ పదవిని కైవశం చేసుకునే ఛాన్స్‌ ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆ పార్టీకి ఉన్న ఎక్స్‌అఫీషియో ఓట్లే అందుకు కారణం. ఈ లెక్కలకు ఎంఐఎం ఓట్లు కూడా కలిసి వస్తే.. అధికార పార్టీకి ఎదురే ఉండదని అనుకుంటున్నారు. గతంలో మాదిరి ఎక్స్‌అఫీషియో ఓట్లు అవసరం లేకుండానే ఈసారి కూడా మేయర్‌ పీఠం దక్కించుకుంటామని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. అయినా అధికార పార్టీ ఛాన్స్‌ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ప్లాన్‌ బీ అమలు చేస్తున్నట్టు సమాచారం.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, శాసనసభ, శాసన మండలి సభ్యులు జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకోవడం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశం. వీరి సంఖ్య ఏకంగా 35 వరకు ఉంది. రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్‌ ఓటుపై మాత్రమే కొన్ని అనుమానాలున్నాయి. ఆయన కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఒకవేళ టీఆర్‌ఎస్‌ కనీసంగా 41 డివిజన్లలో గెలిచి.. 35 మంది ఎక్స్‌అఫీషియో సభ్యుల సాయంతో మేయర్‌ పీఠం ఎక్కడానికి వీలు కలుగుతుంది. టీఆర్‌ఎస్‌తో పొత్తు కాకుండా దోస్తీ చేస్తోన్న MIMకు 10 ఎక్స్‌ అఫీషియో ఓట్లు ఉన్నాయి. వీరు కూడా టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తే టీఆర్‌ఎస్‌ బలం ఇంకా పెరుగుతుంది. అప్పుడు టీఆర్‌ఎస్‌ 31 డివిజన్లలో గెలిచినా వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదన్నది విశ్లేషకుల మాట.

ఇటీవల గవర్నర్‌ కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీలుగా నామినేట్‌ అయ్యారు. ఆ ముగ్గురు కూడా కలిస్తే టీఆర్‌ఎస్‌ ఎక్స్‌ అఫీషియో బలం 35 నుంచి 38కి పెరుగుతుంది. అయితే ఎక్స్‌అఫీషియో సభ్యులు ఎంత మంది అన్నది డిసెంబర్‌ 4 తర్వాత మరింత క్లారిటీ వస్తుంది. మేయర్‌ ఎన్నిక సందర్భంగా ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా పేర్ల నమోదుకు ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ ఇస్తారు. అప్పుడు కొత్తగా గ్రేటర్ లో ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు పేర్లు నమోదు చేసుకునే అవకాశం ఉంది.

ఎక్స్‌ అఫీషియో సభ్యుల బలాన్ని పరిగణనలోకి తీసుకుని టీఆర్‌ఎస్‌ కాకుండా ఇతర పార్టీలు బల్దియా పీఠం అధిరోహించాలంటే చాలా బలం బలగమే కావాలి. MIMకు పది మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఉండటంతో ఒకవేళ మజ్లిస్‌ అభ్యర్ధి మేయర్‌ కావాలంటే.. ఆ పార్టీ 88 డివిజన్లలో గెలుపొందాలి. కానీ MIM 51 డివిజన్లలోనే పోటీ చేసింది.

ఇక బీజేపీకి ముగ్గురు ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఒకవేళ మేయర్‌ పీఠం కమలానికి దక్కాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీ 95 డివిజన్లలో గెలుపొందాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌ చూసుకుంటే.. ఆ పార్టీ ఒకే ఒక్క ఎక్స్‌ అఫీషియోసభ్యుడు ఉన్నారు. కాంగ్రెస్‌కు మేయర్‌ పీఠం దక్కాలంటే 97 డివిజన్లలో గెలుపొందాల్సి ఉంటుంది. మరి.. గ్రేటర్‌ వార్‌లో ఏ పార్టీ ఏ మేరకు శక్తిని చాటుతుందో తెలియాలంటే డిసెంబర్‌ 4 వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news