అమెరికా అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్‌ల మధ్య రెండో ముఖాముఖిపై సందిగ్ధత నెలకొందన్న సంగతి తెలిసిందే. అయితే కరోనా సోకిన నేపధ్యంలో రెండో డిబేట్‌ను వర్చువల్ పద్ధతిలో జరపాలన్న కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ వ్యతిరేకించారు. వర్చువల్‌గా నిర్వహిస్తే తాను పాల్గొనబోనని చెప్పారు. దీంతో రెండో ముఖాముఖి చర్చ రద్దయింది. అక్టోబర్ 15న జరగాల్సిన చర్చను రద్దు చేస్తున్నట్లు కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ కొద్ది సేపటి క్రితం అధికారికంగా వెల్లడించింది.
ట్రంప్ కు కరోనా సోకడంతో చర్చను వర్చువల్‌గా నిర్వహించాలని కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ భావించింది. అయితే దీనిని ట్రంప్ వ్యతిరేకించారు. తాను ముఖాముఖి చర్చలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. బైడెన్ మాత్రం తాను నేరుగా ట్రంప్‌తో చర్చలో పాల్గొనబోనని స్పష్టం చేశారు. దానికి తోడు అక్టోబర్ 15న చర్చ జరగాల్సిన సమయంలో ఈ ఇద్దరూ ఇతర కార్యక్రమాల్ని పెట్టుకున్నారు. దాంతో ముఖాముఖి చర్చ సాధ్యం కాదని రద్దు చేస్తున్నామని కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ ప్రకటించింది. అయితే ఈ నెల 22న జరగాల్సిన తుది ముఖాముఖి చర్చకు మాత్రం ట్రంప్, బైడెన్ అంగీకరించడం గమనార్హం.