అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చైనా విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. రోజు రోజుకి ఆ దేశం మీద విమర్శల తీవ్రతను ఆయన దారుణంగా పెంచుతున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కరోనా సమాచారాన్ని బహిర్గతపర్చడంలో చైనా ఆలస్యం చేసిందని ఆయన మండిపడ్డారు. ఆ వైరస్ ని ఉద్దేశపూర్వకంగా విడుదల చేసినట్లు తేలితే మాత్రం చైనాకు చుక్కలు చూపిస్తామని అన్నారు.
అది ఏ స్థాయిలో ఉంటుంది అంటే… మీకు తెలుసు 1917 కాలం నాటి పరిస్థితులకు దిగజారిపోతుందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పొరపాటుకు, కావాలని చేసేదానికి చాలా తేడా ఉంటుందన్న ట్రంప్ అదేంటో తాము నిగ్గుతేలుస్తామని ఈ సందర్భంగా చైనాను ఉద్దేశించి అన్నారు. ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడటానికి చైనా సహకరించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు ట్రంప్. కరోనా తర్వాత ఇరాన్ లో చాలా మార్పు కనపడుతుంది అన్నారు ఆయన.
ఇదిలా ఉంటే ఫ్రెంచ్ శాస్త్రవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత మోంటాజ్ఞయిర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ల్యాబ్ నుంచే కరోనా బయటకు వచ్చిందని… ఎయిడ్స్‌కు మందును కనుక్కొనే క్రమంలో కరోనా బయటకు వచ్చి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా జన్యుపటంలో హెచ్ఐవీ, మలేరియా దాఖలాలున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. వూహాన్ నగరంలోని వైరాలజీ ల్యాబ్‌లో 2000 సంవత్సరం నుంచే కరోనా వైరస్ ఉందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.