సాధారణంగా స్త్రీ, పురుషులు ఎవరికైనా సరే వయస్సు అయిపోతున్నకొద్దీ సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. మహిళల్లో అయితే అండాలు తక్కువగా విడుదలవుతాయి. గర్భం దాల్చడం కష్టమవుతుంది. పురుషుల్లో వీర్యం తక్కువగా ఉత్పత్తి అవుతుంది, లేదా నాణ్యత లోపిస్తుంది. అయితే 40 ఏళ్లు దాటిన వారు ప్రెగ్నెంట్ అవ్వాలని చూస్తుంటే మాత్రం పలు విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. అవేమిటంటే..
40 ఏళ్ల వయస్సులో మహిళల శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. మెనోపాజ్ దశ సమీపిస్తుంటుంది. అండాలు తక్కువగా ఉత్పత్తి అవుతుంటాయి. మహిళలకు యుక్త వయస్సులో లక్షల సంఖ్యలో పరిపక్వత చెందని అండాలు ఉంటాయి. కానీ ఒక వయస్సుకు వచ్చాక.. అంటే 20లలో వాటి సంఖ్య 3 లక్షలకు చేరుకుంటుంది. ప్రతి నెలా నెలసరి సమయంలో అండాశం నుంచి ఒక అండం విడుదలవుతుంది. అదే సమయంలో కొన్ని అండాలు నాశనమవుతాయి. 30లలో అండాల నాణ్యత, పరిమాణం తగ్గుతాయి. 40 దాటాక ఆ సంఖ్య ఇంకా తగ్గుతుంది.
40 ఏళ్ల వయస్సులో మిగిలి ఉన్న అండాలు జన్యు పరంగా అసాధారణ రీతిలో ఉంటాయి. అందువల్ల ఆ వయస్సులో గర్భం దాల్చడం మరింత కష్టంగా ఉంటుంది. అయితే అలాంటి మహిళలు దిగులు చెందాల్సిన పనిలేదు. టెక్నాలజీ మారింది. ఎన్నో అధునాతన సాంకేతిక పరికరాలు, పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. కనుక 40 దాటిన మహిళలు కూడా సులభంగా గర్భం దాల్చవచ్చు.
అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్‌టీ) అనే విధానం ద్వారా 40 దాటిన మహిళలు కూడా ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చవచ్చు. దీంతోపాటు ఐసీఎస్ఐ అనే మరో విధానంతోనూ గర్భం దాల్చేందుకు అవకాశాలు ఉంటాయి. అయతే సరైన నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. దీంతో గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి.
40 ఏళ్లు దాటాక గర్భం దాలిస్తే పిండం ఎదుగుదలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కనుక ఎప్పటికప్పుడు పిండం ఆరోగ్యంగా ఉందో లేదో చెక్ చేయించుకోవాలి. ఇక మహిళలకు ఆ సమయంలో వికారం, అధిక షుగర్ లెవల్స్, హైబీపీ వంటి సమస్యలు సాధారణ గర్భిణీల కన్నా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ విషయాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అప్పటికే డయాబెటిస్, హైబీపీ, థైరాయిడ్, స్థూలకాయం వంటి సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. దీంతో 40 ఏళ్ల వయస్సులోనూ సులభంగా గర్భం దాల్చి పిల్లలను కనేందుకు అవకాశం ఉంటుంది.