TSPSC పేపర్ లీకేజీలో మరో ట్విస్ట్.. ప్రవీణ్‌ పరీక్ష రాస్తున్నట్లు తెలిసినా…

-

టీఎస్‌పీఎస్సీ క్వశ్చన్ పేపర్ల లీకేజీ కేసులో పోలీసులకు తీగ లాగుతున్న కొద్దీ డొంక కదులుతోంది. లోతుగా దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు రోజుకో విస్తుపోయే విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ గురించి కమిషన్‌ ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అతను టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 పరీక్ష రాస్తున్నట్లు తెలిసినా..అన్ని సెక్షన్లలోకి వెళ్లేందుకు అనుమతించడం చర్చనీయాంశంగా మారింది.

పరీక్ష రాసేందుకు ప్రవీణ్‌ అనుమతి తీసుకున్నట్లు కమిషన్‌ ధ్రువీకరించింది. అలాంటప్పుడు పరీక్ష ముగిసేవరకు వేరే సెక్షన్‌కు బదిలీచేయడమో లేదా కీలకమైన రహస్య కార్యకలాపాల నుంచి దూరంగా పెట్టడమో చేయాలి. కానీ, అతని విషయంలో కమిషన్‌ పరిపాలన సిబ్బంది తగినవిధంగా స్పందించలేదన్న విమర్శలున్నాయి.

సాధారణంగా ఉద్యోగప్రకటన గురించి ప్రతి నిర్ణయం కమిషన్‌ కార్యదర్శి పేరిట వెలువడుతుంది. ప్రకటనలు ఎప్పుడొస్తాయి? నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులున్నాయి? తదితర వివరాలకు సంబంధించిన దస్త్రాలు సెక్షన్లలోని సిబ్బంది నుంచి వ్యక్తిగత సహాయకుడి(పీఏ) ద్వారానే కార్యదర్శికి చేరుతుంటాయి. కార్యదర్శిని కలిసేందుకు వివిధ సెక్షన్ల సిబ్బంది వెళ్లిన సమయంలో.. ఆయా సెక్షన్లలోకి ప్రవీణ్‌ అక్రమంగా ప్రవేశించాడని.. ఏఈ, టీపీబీవో ప్రశ్నపత్రాలు తస్కరించాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

Read more RELATED
Recommended to you

Latest news