ఉల్లిరైతులకు క్వింటాకు రూ.600 తక్షణమే అందించాలి. రైతుల రుణాలను మాఫీ చేయాలి. ఇలా పలు డిమాండ్లతో నాసిక్ నుంచి మహారాష్ట్ర రైతులు ముంబయికి పాదయాత్రగా తరలివెళ్తున్నారు. ఐదు రోజుల క్రితం నాసిక్ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రలో.. అరికాళ్లు పగిలినా, పాదాల నుంచి రక్తం కారుతున్నా.. ఏ మాత్రం లెక్కచేయకుండా మహారాష్ట్ర రైతులు ముందుకెళ్తున్నారు. నాసిక్-టు-ముంబయి 200 కిలోమీటర్ల మేర తలపెట్టిన మహా పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
ధరలు భారీగా పడిపోవడంతో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారు. సీపీఎం ఆధ్వర్యంలో ఈ మార్చ్ జరుగుతోంది. ఇందులో రైతన్నలతో పాటు గిరిజన సంఘాల సభ్యులు, ఆశా కార్యకర్తలు పాల్గొంటున్నారు. వీరితో చర్చలు జరిపేందుకు మహారాష్ట్ర ఇద్దరు మంత్రులను నియమించింది. వారు ఇప్పటికే రైతు ప్రతినిధులను కలిశారు. అన్నదాతల సమస్యలను పరిష్కరించాలంటూ విపక్షాలు కోరుతున్నాయి.
అధిక ఉత్పత్తి వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే అన్నారు. అలాగే క్వింటాకు రూ.300 మేర పరిహారం ప్రకటించారు. రైతుల పాదయాత్రపై ప్రభుత్వం అసెంబ్లీలో స్పందించింది. ‘ వారు 14 డిమాండ్లతో ఈ పాదయాత్ర చేస్తున్నారు. చట్టపరిధిలో ప్రభుత్వం వాటన్నింటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంది’ అని తెలిపింది.