ప్రయాణికులకు మరోసారి షాక్ ఇచ్చేందుకు టీఎస్ ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు రౌండ్ ఫిగర్ అంటూ ఓసారి, డీజిల్ సెస్ పేరుతో రెండుసార్లు, టోల్ సెస్, ప్యాసింజర్ సేఫ్టీ సెస్ తో దాదాపు 35 శాతం వరకు బస్సు ఛార్జీలు పెంచింది టీఎస్ ఆర్టీసీ. అయినప్పటికీ నష్టం వస్తుందని ఈసారి టికెట్ ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నారు టీఎస్ ఆర్టీసీ అధికారులు. ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి.. ప్రతిపాదనలను ప్రభుత్వానికి సైతం పంపించారు. సగటున 20 నుంచి 30 శాతం వరకు పెంచుకునేందుకు ప్రపోజల్స్ లో సూచించారు అధికారులు.
త్వరలోనే దీనికి ఆమోదం వస్తుందని అధికారులు అంటున్నారు. టికెట్ ధరల పెంపుపై ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పలు సందర్భాల్లో ప్రకటించారు. అయితే, డీజిల్ సెస్ రూపంలో రెండుసార్లు పెంచగా.. టికెట్ ధరలపై మరోసారి పెంపు ఉండదని భావించారు. సెస్ ల రూపంలో అదనంగా వసూళ్లు చేస్తున్నా.. ఇంకా రూ.2.40 కోట్ల వరకు నష్టం వస్తుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు.దీంతో దీన్ని భర్తీ చేసుకునేందుకు ఇప్పుడు టికెట్ ధరల పెంపు అనివార్యంగా మారుతోంది.