దసరా పండుగ సమీపిస్తోంది. నగరాలు, పట్టణాలల్లో ఉన్న వాళ్లంతా పల్లెబాట పట్టడానికి రెడీ అవుతున్నారు. ఊళ్లకు వెళ్లడానికి బస్సు, రైలు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. సాధారణంగా పండుగ వచ్చిందంటే ప్రయాణికులపై భారం మోపే తెలంగాణ ఆర్టీసీ ఈ సారి కొంత పంథాలో వెళ్లడానికి నిర్ణయించింది. దసరాకు ఊళ్లకు వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది.
ఈనెల 24 నుంచి వచ్చే నెల 5 వరకు 4,198 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. అయితే ప్రత్యేక బస్సులనగానే ఎడాపెడా ఛార్జీలు పెంచేస్తుంటారు. కానీ ఈ సారి అలా జరగడం లేదు. ఎందుకంటే సాధారణ ఛార్జీలతోనే ప్రత్యక బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు కూడా ప్రత్యేక బస్సులను నడిపించనున్నట్లు రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీధర్ తెలిపారు. ప్రధాన బస్ స్టేషన్లతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 3,795 ప్రత్యేక బస్సులు, ఆంధ్రపదేశ్‌కు 328, కర్ణాటకకు 75 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు.