ప్రధాని మోదీ బర్త్ డే రోజున నమీబియా నుంచి మధ్యప్రదేశ్‌లోని శ్యోపుర్ జిల్లా కునో జాతీయ పార్కుకు తరలించిన 8 చీతాలపై నిపుణులు నిఘా పెట్టారు. ఈ చీతాలు కొత్త వాతావరణానికి అలవాటు పడ్డాయోలేదోనని పర్యవేక్షిస్తున్నారు. వాటికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. చీతాల ఆరోగ్యం, ప్రవర్తనపై నిపుణులు నిఘా పెట్టారు.
మనుషులతో వాటికి ఎలాంటి ఇబ్బంది ఎదురవకుండా ఎన్‌క్లోజర్లకు 50 నుంచి 100 మీటర్ల దూరంలో గడ్డివాములతో ఏర్పాటుచేసిన మంచెల్లాంటి నిర్మాణాల నుంచి నిపుణులు నిఘా పెట్టారు. చీతాల కంటపడకుండా వాటికి అడ్డుగా తెరలు ఏర్పాటు చేసి, రంధ్రాల నుంచి కదలికలను పరిశీలిస్తున్నారు. ఫ్రెడ్డీ, ఆల్టన్, సావన్నా, సాషా, ఓబాన్, ఆశా, సిబిలి, సైసా.. అనే పేర్లు గల ఈ చీతాలు ఆరు క్వారంటైన్ ఎన్‌క్లోజర్లలో నెల రోజులపాటు గడపనున్నాయి. ఒక ఖండం నుంచి మరో ఖండానికి వచ్చినందున ప్రొటోకాల్ ప్రకారం ఇది తప్పనిసరి.