అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్ యాప్‌ను 45 రోజుల్లో నిషేధిస్తామని గత 2 రోజుల కిందట చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఆయన ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై కూడా సంతకం చేశారు. దీంతో సెప్టెంబర్ 15వ తేదీ వరకు టిక్‌టాక్‌ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయకపోతే.. ఆ యాప్ అమెరికాలో బ్యాన్ అవుతుంది. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ వీలైనంత త్వరగా డీల్‌ను ముగించేయాలని చూస్తోంది. అయితే తాజాగా ఈ డీల్‌లోకి ట్విట్టర్ రంగ ప్రవేశం చేసింది. టిక్‌టాక్‌కు చెందిన అమెరికా కార్యకలాపాలను ట్విట్టర్ కొనుగోలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది.
టిక్‌టాక్ ను కొనుగోలు చేయడంపై ప్రస్తుతం ట్విట్టర్ కూడా ఆసక్తిగా ఉందని తెలిసింది. ఈ మేరకు ట్విట్టర్ ఇప్పటికే టిక్‌టాక్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే దీనిపై అటు టిక్‌టాక్, ఇటు ట్విట్టర్‌లు కామెంట్ చేయలేదు. మరోవైపు మైక్రోసాఫ్ట్ కూడా టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంది. అయితే నిజానికి ట్విట్టర్ కంపెనీ విలువ సుమారుగా 30 బిలియన్ డాలర్లు ఉంటుంది. అది టిక్‌టాక్ కంపెనీ విలువకు సమానం. అలాంటప్పుడు ట్విట్టర్ కంపెనీ టిక్‌టాక్‌ను కొనాలంటే దానికి నిధులు కావాలి. కానీ ట్విట్టర్ నిధులు సమీకరించుకోగలనన్న ధీమాతోనే ఉంది. దీంతో టిక్‌టాక్, మైక్రోసాఫ్ట్‌లు ఇప్పుడు టిక్‌టాక్ కొనుగోలుకు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
అయితే టిక్‌టాక్‌కు చెందిన భారత, ఐరోపా కార్యకలాపాలను మాత్రమే మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ట్విట్టర్ ఈ డీల్‌లోకి ప్రవేశించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నిజానికి టిక్‌టాక్‌కు భారత్ నుంచే ఎక్కువ మొత్తంలో ఆదాయం లభిస్తుంది. అందువల్లే మైక్రోసాఫ్ట్ ఇటు వైపు దృష్టి సారించినట్లు తెలిసింది. అయితే మైక్రోసాఫ్ట్ మాత్రం సెప్టెంబర్ రెండో వారం లోపలే ఈ డీల్‌ను ముగించేయాలని చూస్తున్నదట. మరి ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరికొద్ది రోజుల పాటు వేచి చూడాల్సిందే.