ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 12 ఏళ్ల విద్యార్థి అతడు. స్కూల్లో తిష్ఠవేసిన సమస్యలు చూసి విసుగెత్తిపోయాడు. దీనికితోడు ఉపాధ్యాయులూ విధులకు సరిగా హాజరు కాకపోవడం అతణ్ని ఆలోచనలో పడేసింది. తనతోపాటు తోటి విద్యార్థులు పడుతున్న బాధలను వెలుగులోకి తేవాలనుకున్నాడు. ఇందుకోసం టీవీ రిపోర్టర్‌గా అవతారమెత్తాడు. ఓ కర్రకు ఖాళీ ప్లాస్టిక్ బాటిల్ తగిలించి దాన్నే మైక్‌గా భావిస్తూ.. పాఠశాలలో కలియతిరుగుతూ అక్కడి దుస్థితిని వివరించాడు.
సాటి విద్యార్థి దీన్ని వీడియో తీశాడు. ఇది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడంతోపాటు పాఠశాలలో సమస్యలను పరిష్కరించడానికి ఆదేశించారు. ఝార్ఖండ్ గోడ్డా జిల్లాలోని భిఖియఛక్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సర్ఫరాజ్ అనే ఆ బుల్లి రిపోర్టర్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిజమైన పాత్రికేయులకు ఏమాత్రం తీసిపోకుండా అతడు సమస్యలను కళ్లకు కట్టిన తీరు మెప్పిస్తోంది. ‘‘మా పాఠశాలలో విద్యార్థులకు తాగడానికి నీరు కూడా లేదు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. మరుగుదొడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. తరగతి గదుల్లో పశువుల మేతను పడేస్తున్నారు. ఇక ఉపాధ్యాయులు విధులకు సరిగా రాకపోవడంతో విద్యార్థులు సక్రమంగా రావడం లేదు. ఇప్పుడు మధ్యాహ్నం 12.45 అవుతున్నా టీచర్లు స్కూల్‌కు రాలేదు’’ అంటూ తమ పాఠశాలలోని దుస్థితిని చక్కగా వివరించాడు.
దీంతోపాటు తోటి విద్యార్థిని నువ్వు పాఠశాలకు ఎందుకు రోజూ రావడం లేదని అడగడం, అందుకు ఆ చిన్నారి స్పందిస్తూ బడిలో మరుగుదొడ్లు దారుణంగా ఉన్నాయని, తాగునీరు కూడా లేదని చెప్పడం వీడియోలో కనిపించింది. ఈ వీడియోను ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. దీనిపై జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారి రజినీ కుమారి స్పందించారు. వెంటనే పాఠశాలకు సంబంధించిన ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేశారు. అక్కడి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
बच्चे की सच्ची पत्रकारिता को दिल से सलाम
वीडियो झारखंड की है और बच्चे का नाम सरफराज है@MaazAkhter800#JharkhandNews #Viral pic.twitter.com/dsKVdtiRSe— Maaz Akhter (@MaazAkhter800) August 4, 2022