కర్ణాటక – మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతూనే ఉంది. సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధౌవ్ ఠాక్రె కొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. కర్ణాటక ఆక్రమిత మహారాష్ట్ర ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని సోమవారం రాష్ట్ర శాసనమండలిలో సూచించారు. ఈ సరిహద్దు గ్రామాలలో తరతరాలుగా మరాఠీ మాట్లాడే ప్రజలు నివాసం ఉంటున్నారని.. వారికి జీవితం, భాషా, జీవనశైలి అంతా మరాఠీ అన్నారు.
ఈ సమస్య సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నంతవరకు కర్ణాటక ఆక్రమిత మహారాష్ట్రను కేంద్ర ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని పేర్కొన్నారు. రాష్ట్రాలకు గార్డియన్ గా ఉండాల్సిన కేంద్రం.. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంలో ప్రేక్షక పాత్ర వహించడమేమిటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం భాషా సరిహద్దు వివాదం మాత్రమే కాదని.. మానవత్వానికి సంబంధించిన అంశం అన్నారు.